Helicopter crash: మరమ్మత్తు కోసం తరలిస్తుండగా, రుద్రప్రయాగ్ లో కూలిన హెలీకాప్టర్
Helicopter crash: సాంకేతిక సమస్య కారణంగా కేదార్ నాథ్ పుణ్యక్షేత్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన హెలీకాప్టర్ ను మరమ్మత్తుల కోసం ఎంఐ 17 ఆర్మీ చాపర్ ద్వారా తరలిస్తుండగా, తీగలు తెగి వందల అడుగుల ఎత్తు నుంచి ఆ హెలీకాప్టర్ కింద నేలపై కుప్పకూలింది.
Helicopter crash: కెస్ట్రెల్ ఏవియేషన్ కు చెందిన ఒక హెలికాప్టర్ ను ఆర్మీ చాపర్ ఎంఐ 17 ద్వారా కేదార్ నాథ్ నుంచి మరమ్మత్తుల కోసం తరలిస్తుండగా, ప్రమాదవశాత్తూ, రుద్ర ప్రయాగ్ ప్రాంతంలో కొండపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు తెలిపారు.
టూరిస్ట్ చాపర్
మే నెలలో కేదార్నాథ్ ధామ్ వద్ద ఆరుగురు చార్ ధామ్ భక్తులతో వెళ్తున్న కెస్ట్రెల్ ఏవియేషన్ కు చెందిన ఒక హెలికాప్టర్ సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ హెలీకాప్టర్ ను మరమ్మతుల కోసం ఉత్తరాఖండ్ ని చమోలిలోని గౌచర్ కు ఎంఐ-17 హెలికాప్టర్ ద్వారా తరలించాలని నిర్ణయించారు. కెస్ట్రెల్ ఏవియేషన్ హెలికాప్టర్ ను శనివారం ఉదయం ఎంఐ 17 చాపర్ తో గట్టిగా, జాగ్రత్తగా కట్టి తీసుకువెళ్లడం ప్రారంభించారు. ఆకాశంలోకి వెళ్లిన తరువాత, ఎంఐ 17 తో కట్టిన వైర్లు తెగిపోయి కెస్ట్రెల్ ఏవియేషన్ హెలికాప్టర్ కింద ఒక చిన్న కొండపై కుప్పకూలింది.
బ్యాలెన్స్ కోల్పోయి..
హెలికాప్టర్ బరువు, గాలి కారణంగా ఎంఐ-17 బ్యాలెన్స్ కోల్పోయింది. థారూ క్యాంప్ సమీపంలోకి చేరుకోగానే ఎంఐ-17 నుంచి హెలికాప్టర్ ను దించాల్సి వచ్చింది. హెలికాఫ్టర్లో ప్రయాణికులు కానీ, లగేజీ కానీ ఏమీ లేదు. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి రెస్క్యూ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
మే 24న అత్యవసర ల్యాండింగ్
కెస్ట్రెల్ ఏవియేషన్ కు చెందిన ఈ హెలికాప్టర్ ఆరుగురు చార్ ధామ్ (CHAR DHAM) యాత్రికులతో వెళ్తుండగా మే 24న కేదార్ నాథ్ (KEDARNATH) పుణ్యక్షేత్రంలోని హెలిప్యాడ్ సమీపంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చార్ ధామ్ యాత్ర సందర్భంగా కేదార్ నాథ్ ప్రాంతంలో హెలికాప్టర్లు రోజుకు సగటున 400 వరకు ప్రయాణాలు చేస్తాయి. 2023 ఏప్రిల్లో ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ (UCADA) సీనియర్ అధికారి కేదార్నాథ్ లో హెలికాప్టర్ టెయిల్ రోటర్ ఢీకొని మరణించారు. 2022 అక్టోబర్లో కేదార్ నాథ్ లో హెలికాప్టర్ కూలిన ఘటనలో పైలట్ సహా ఆరుగురు భక్తులు మృతి చెందారు.