'యుద్ధానికి సైతం వెనకాడము'- అమెరికాకు చైనా హెచ్చరిక-china will not hesitate to start war over taiwan beijing tells us ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  China Will 'Not Hesitate To Start War' Over Taiwan, Beijing Tells Us

'యుద్ధానికి సైతం వెనకాడము'- అమెరికాకు చైనా హెచ్చరిక

Sharath Chitturi HT Telugu
Jun 11, 2022 07:45 AM IST

China Taiwan news : తైవాన్​ వ్యవహారంలో యుద్ధానికి సైతం వెనకాడమని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది చైనా. చైనా నుంచి తైవాన్​ను వేరుచేయాలని ఏవరైనా ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తేల్చిచెప్పింది.

'యుద్ధానికి సైతం వెనకాడము'- అమెరికాకు చైనా హెచ్చరిక
'యుద్ధానికి సైతం వెనకాడము'- అమెరికాకు చైనా హెచ్చరిక (Bloomberg)

China Taiwan news : తైవాన్​ విషయంపై అమెరికా- చైనా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా.. అగ్రరాజ్యంపై చైనా మరోమారు విరుచుకుపడింది. తైవాన్​.. స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంటే.. యుద్ధానికి సైతం వెనకాడమని అమెరికాకు తేల్చి చెప్పింది డ్రాగన్​ దేశం.

ట్రెండింగ్ వార్తలు

అమెరికా-చైనా రక్షణ మంత్రుల మధ్య శుక్రవారం ఓ భేటీ జరిగింది. ఇందులోనే తైవాన్​ అంశం చర్చకు వచ్చింది.

"చైనా నుంచి తైవాన్​ను వేరుచేయాలని ఏవరైనా ధైర్యం చేసి ముందడుగేస్తే.. యుద్ధానికి సైతం మా సైన్యం వెనకాడదు. యుద్ధంతో ఎంత నష్టం జరిగినా మాకు సంబంధం లేదు. స్వాతంత్ర్యం పొందేందుకు తైవాన్​ చేసే ప్రయత్నాలు పతాళంలోకి తొక్కేస్తాము," అని చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే​.. అమెరికా రక్షణమంత్రి లాయిడ్​ ఆస్టిన్​కు చెప్పారు.

తైవాన్​ అంటేనే చైనాకు చెందినదని, దానిని పావుగా వాడుకుని తమపై కుట్రలు పణ్నేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం అవ్వవమని చైనా రక్షణమంత్రి తేల్చిచెప్పారు.

తైవాన్​పై చర్యలు చైనా మానుకోవాలని సూచించారు ఆస్టిన్​. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించినట్టు సమాచారం.

ఎన్నో ఏళ్లుగా తైవాన్​కు స్వతంత్ర ప్రభుత్వం ఉంది. కాగా.. తైవాన్​ తమ దేశంలో భాగమని చైనా వాదిస్తూ వస్తోంది. ఏదో ఒకరోజున.. తైవాన్​ను తమ భూభాగంలో చేర్చుకుంటామని చైనా ఇప్పటికే అనేకమార్లు తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పలుమార్లు ఉద్రిక్త వాతావరణం సైతం నెలకొంది.

తైవాన్​ వ్యవహారంపై అమెరికా దశాబ్దాలుగా మౌనంగానే ఉంది. కాగా.. ఇటీవలే జపాన్​ పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. తైవాన్​పై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తైవాన్​ జోలికొస్తే.. అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని చైనాకు హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా- చైనా ఉద్రిక్తతలు..

China America relations : అమెరికా- చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తైవాన్​తో పాటు రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంపైనా ఇరు దేశాలు మాటల యుద్ధానికి దిగాయి. రష్యాకు చైనా సహకరిస్తోందని అగ్రరాజ్యం ఆరోపించింది.

మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో తమ ఉనికిని విస్త్రతం చేయాలని చైనా భావించడం కూడా అమెరికాను ఆగ్రహానికి గురిచేసింది. అటు భారత్​లోని లద్దాఖ్​లో చైనా అక్రమ కట్టడాలపైనా అగ్రరాజ్యం తన అసహనాన్ని వ్యక్తం చేసింది.

యుద్ధానికి చైనా సన్నద్ధం..!

తైవాన్​పై చైనా దండయాత్రకు ప్రణాళికలు రచిస్తున్నట్టు.. గత నెలలో వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన చైనా 'ఆడియో క్లిప్స్​' ఇప్పుడు వైరల్​గా మారాయి.

మిషన్​ తైవాన్​'పై చైనా సీరియస్​గా ఉన్నట్టు తెలుస్తోంది. చైనా ఉన్నతాధికారుల మధ్య ఓ రహస్య సమావేశం జరిగిందంటూ.. గంట నిడివి గల ఆడియో క్లిప్​ ఒకటి బయటకొచ్చింది. అందులో అనేకమంది చైనీస్​ భాషలో మాట్లాడుకున్నారు.

కమ్యూనిస్ట్​ పార్టీ ఆఫ్​ చైనాకు చెందిన సీనియర్​ అధికారులు.. పీపుల్స్​ లిబరేషన్​ అర్మీ సభ్యులతో భేటీ అయ్యారు. తైవాన్​ను అణచివేయడం, ఆ దేశ భద్రతాదళాలను చిన్నాభిన్నం చేయడం వంటి విషయాలపై వారు మాట్లాడుకున్నారు. అవసరమైతే యుద్ధాన్ని మొదలుపెట్టడానికైనా వెనకడుగు వేయకూడదని వారు నిర్ణయించుకున్నారు. చైనా సార్వభౌమత్వానికి, సరిహద్దు భద్రతకు ఇది ఎంతో అవసరమని ఏకీభవించారు.

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రాంతం నుంచి దండయాత్ర మొదలు పెట్టాలని అధికారులు భావించారు. పక్కా ప్రణాళిక రచించి, అవసరమైన సైన్యాన్ని, వస్తువులను మోహరించి ముందుకు సాగాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితులు.. యుద్ధానికి దారితీసినట్టుగా చిత్రీకరించాలని వారు ఆలోచిస్తున్నారు.

కాగా.. ఆడియో క్లిప్​ను పరిశీలిస్తే.. గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో ఇప్పటికే పలు కంపెనీలు చైనా 'ప్రయోజనాల' కోసం పని చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఈ మిషన్​ కోసం 1.40లక్షల మిలిటరీ సిబ్బంది, 953 ఓడలు, 1,653 మానవరహిత ఆయుధ పరికరాలు, 20 విమానాశ్రయాలు- ఓడరేవులతో పాటు ఆహార ధాన్యాలు, ఆసుపత్రులు, బ్లడ్​ బ్యాంక్​లు, గ్యాస్​ స్టేషన్లు కావాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. వీటిని సమకూర్చే బాధ్యత గ్వాంగ్‌డాంగ్ అధికారులకు అప్పగించారు!

అంతేకాకుండా.. ఈ వ్యవహారం కోసం నియామకాలు చేపట్టేందుకు మిలిటరీ సిబ్బందిని రంగంలోకి దింపాలని అధికారులు భావించారు. రిటైర్డ్​ ఆర్మీ సిబ్బందిని కూడా వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నారు.

ఈ ఆడియో క్లిప్​పై చైనా స్పందించలేదు. కాగా.. ఈ ఆడియో క్లిప్​లో ఉన్న మాటలు.. అసలు చైనా అధికారులవేనా? లేక వీటిని తైవాన్​ చిత్రీకరించి.. చైనా మీద ఆరోపణలు చేస్తోందా? అన్న విషయంపై స్పష్టత లేదు. కాగా.. చైనా అధికారుల్లోని కొందరు.. ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​ కుట్రలను ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ ఆడియో క్లిప్స్​ను లీక్​ చేసినట్టు పలువురు భావిస్తున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్