China Population: భారీగా తగ్గిపోయిన చైనా జనాభా.. 60ఏళ్లలో తొలిసారి..
China Population fall: 2022లో చైనాలో జనాభా పడిపోయింది. కిందటి సంవత్సరం కంటే చైనాలో జనాభా తగ్గిపోవడం 1961 తర్వాత ఇదేతొలిసారి. పూర్తి వివరాలు ఇవే.
China Population fall: చైనా జనాభా గతేడాది (2022) గణనీయంగా తగ్గింది. డ్రాగన్ దేశంలో గత అరవై సంవత్సరాల్లో జనాభా తగ్గడం ఇదే తొలిసారిగా ఉంది. ఇప్పటికే యువత శాతం తగ్గి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న చైనాకు జనాభా తగ్గుదల, జననాల రేటు పడిపోవడం ఆందోళనకరంగా మారింది. మొత్తంగా చైనా.. జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వివరాలు ఇవే.
8.50లక్షలు తగ్గిన జనాభా
China Population: 2022 ముగిసే నాటికి చైనా జనాభా 1,411,750,000 (సుమారు 140కోట్లు)గా ఉంది. కిందటి సంవత్సరం (2021)తో పోలిస్తే జనాభా ఏకంగా 8,50,000 తగ్గింది. చైనా జనాభా తగ్గడం 1961 తర్వాత ఇదే తొలిసారి. ఈ గణాంకాలను చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాస్టిక్స్ వెల్లడించింది.
జననాల కంటే మరణాలు ఎక్కువ
China Population fall: 2022లో చైనాలో జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. డ్రాగన్ దేశంలో 1976 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి. 1000 మందిలో మరణాలు రేటు 7.18గా నమోదైంది. 1976లో ఇది 7.37గా రికార్డ్ అయింది. 2022లో చెరో 1000 మంది మహిళలకు 6.77 జాతీయ జననాల రేటు రికార్డ్ అయింది. 2021లో ఇది 7.52గా ఉండేది.
వికటించిన ప్రయోగం
China Population fall: జనాభా నియంత్రణ కోసం 1980ల్లో ఒక సంతానం విధానాన్ని (One Child Policy) చైనా ప్రవేశపెట్టింది. అంటే దంపతులు ఒకే బిడ్డకు జన్మనివ్వాలి. అయితే ఈ విధానం కొన్ని సంవత్సరాలకు వికటించింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పని చేసే యువత సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతి ఇస్తూ 2015లో ఈ దేశ ప్రభుత్వం నిబంధన తెచ్చింది. అయినా ఫలితాలు రాలేదు. దీంతో 2021లో ముగ్గురు పిల్లల పాలసీని చైనా తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా ప్రజలు మాత్రం పిల్లలను ఎక్కువగా కనేందుకు ఆసక్తి చూపడం లేదు. చైనాలో ప్రజల జీవన వ్యయం (Cost Of living) నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ముందుకురావడం లేదు.
మరోవైపు మూడేళ్లుగా చైనాను కొవిడ్-19 అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల ఆ దేశంలో లక్షలాది మరణాలు సంభవించినట్టు కూడా సమాచారం బయటికి వస్తోంది.
వృద్ధిలోనూ క్షీణత
2022కు గాను చైనాలో జీడీపీ వృద్ధి 3శాతంగా నమోదైంది. గత 50 సంవత్సరాల్లో ఆ దేశానికి ఇదే రెండో అత్వల్ప వృద్ధిగా ఉంది. ఇటీవల జీరో కొవిడ్ పాలసీని ఎత్తేయటంతో ఈ మాత్రం వృద్ధిని చైనా సాధించగలిగింది.