China Mega Embassy : లండన్‌లో మెగా ఎంబసీ కార్యాలయానికి చైనా ప్లానింగ్.. ఇక్కడ వద్దంటూ పెద్ద ఎత్తున నిరసనలు
China Mega Embassy In UK : బ్రిటన్‌లోని చారిత్రాత్మక లండన్ టవర్ సమీపంలో యూరప్‌లోనే అతిపెద్ద రాయబార కార్యాలయాన్ని చైనా నిర్మించబోతోంది. కానీ లండన్ ప్రజలు, హాంకాంగ్ నుంచి వచ్చిన శరణార్థులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం ప్రారంభించారు.

చైనా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కింద బ్రిటన్‌లో యూరప్‌లోనే అతిపెద్ద రాయబార కార్యాలయాన్ని నిర్మించేందుకు చూస్తోంది. అయితే లండన్‌లోని స్థానికులు, హాంకాంగ్ నుంచి వచ్చిన శరణార్థులు ఈ ప్రాజెక్టును చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చైనాలోని ఈ భారీ నిర్మాణ స్థలం వద్ద వేలాది మంది నిరసనకారులు గుమిగూడి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
చైనా ప్రాజెక్టుకు నిరసనగా అక్కడకు చేరుకున్న ప్రజలు 'మెగా ఎంబసీ, మెగా ఎంబసీకి నో' అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఈ నిరసనకారుల్లో చేరారు. ఈ ప్రాంతంలో మెగా రాయబార కార్యాలయం అవసరం లేదని ఓ నిరసనకారుడు తెలిపారు.
ఈ ప్రదేశంలో రాయబార కార్యాలయం నిర్మించడంతో ఇక్కడి స్థానిక ప్రజలు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ ప్రదేశంలో చైనా రాయబార కార్యాలయం నిర్మిస్తే ఇక్కడ నిఘా పెరుగుతుందని, ఇది తమ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ప్రజలు అంటున్నారు. రాయబార కార్యాలయం చుట్టూ ఉన్న భాగాన్ని కూడా క్రమంగా కొనుగోలు చేస్తారని, తమ ఆస్తులను వదులుకోవలసి ఉంటుందని జనాలు అంటున్నారు.
హాంకాంగ్ కు చెందిన తాయ్ చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇక్కడ చైనా రాయబార కార్యాలయం నిర్మిస్తే కచ్చితంగా ఇక్కడ నివసిస్తున్న హాంకాంగ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తుందో అనుభవం ఉందన్నారు.
చైనా మెగా ఎంబసీ ఇక్కడకు రావడం తమకు ఇష్టం లేదని షాడో జస్టిస్ సెక్రటరీ రాబర్ట్ జెన్రిక్ అన్నారు. 'ఇది మన దేశ జాతీయ భద్రతకు విరుద్ధం. చైనా మన మేధో సంపత్తిని కొల్లగొడుతుంది, మన ప్రభుత్వ సభ్యులపై గూఢచర్యం చేస్తుంది. బ్రిటీష్ పౌరులను నిరంతరం వేధిస్తుంది. యూరప్‌లో అతిపెద్ద మెగా ఎంబసీ, రాయబార ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉండటానికి అనుమతించం. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమూ అలా చేయదు. దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి.' అని జెన్రిక్ పేర్కొన్నారు.
బ్రిటన్ లోని టవర్ ఆఫ్ లండన్ సమీపంలో తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం లండన్‌లోని ఓల్డ్ రాయల్ మింట్ సైట్ భూమిని కొనుగోలు చేసింది. ఇది 5.4 ఎకరాల భూమి 1809 నుండి 1967 వరకు రాయల్ మింట్‌గా పనిచేసింది. 2010 లో ఈ ఆస్తిని ఒక డెవలపర్‌కు విక్రయించింది ప్రభుత్వం. అక్కడ నుండి భూమి చైనా కొనుగోలు చేసింది.
చైనా ఎంబసీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. 'కొత్త చైనా ఎంబసీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. యూకేలోని మన రాయబార కార్యాలయం చైనా, యూకే ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి.' అని ఎంబసీ అధికార ప్రతినిధి అన్నారు.