China New Virus : చైనాలో కొత్త వైరస్​ కలకలం- మళ్లీ కొవిడ్​ తరహా పరిస్థితులు!-china new virus outbreak scares everyone five years after covid crisis ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China New Virus : చైనాలో కొత్త వైరస్​ కలకలం- మళ్లీ కొవిడ్​ తరహా పరిస్థితులు!

China New Virus : చైనాలో కొత్త వైరస్​ కలకలం- మళ్లీ కొవిడ్​ తరహా పరిస్థితులు!

Sharath Chitturi HT Telugu

China New Virus : చైనాలో కొత్త వైరస్​ కలకలం సృష్టిస్తోంది. ఫలితంగా ఆ దేశంలో మళ్లీ కొవిడ్​ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులు, మరణాలతో స్నశానాలు కిక్కిరిసిపోతున్నాయి!

చైనలో కొత్త వైరస్​ కలకలం..!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 విజృంభించిన సరిగ్గా 5ఏళ్లకు చైనాలో కొత్త వైరస్​ కలకలం సృష్టిస్తోంది! దీని పేరు హ్యూమన్​ మెటాన్యుమోవైరస్​ (హెచ్​ఎంపీవీ). పలు నివేదికలు, సోషల్​ మీడియా కథనాల ప్రకారం ఈ వైరస్​ అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్​ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్​, స్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని తెలుస్తోంది.

చైనాలో కొత్త వైరస్​ కలకలం..

ఈ హెచ్​ఎంపీవీలో ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. అంతేకాదు కరోనా వైరస్​ సోకినప్పుడు కనిపించిన లక్షణాలు కూడా ఈ హెచ్​ఎంపీవీ వైరస్​తో గుర్తించవచ్చు. కొత్త వైరస్​పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి, పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

"చైనాలో అనేక వైరస్​లు ఒకేసారి వ్యాపిస్తున్నాయి. వీటిల్లో ఇన్​ఫ్లుయెంజా ఏ, హెచ్​ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్​-19 ఉన్నాయి. వీటి వల్ల ఆసుపత్రులు, క్రిమేషన్​ గ్రౌండ్లు కిక్కిరిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పిల్లల ఆసుపత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది," అని సార్స్​- సీఓవీ-2 అనే ఎక్స్​ అకౌంట్​ కొన్ని ఫొటోలను పోస్ట్​ చేసింది.

మరోవైపు న్యుమోనియా తరహా వైరస్​ని పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చైనా అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్​ ఒక కథనం ప్రచురించింది. శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన కేసులు పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కొత్త వైరస్​లతో పోరాడేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుందని చైనా అధికారులు భావిస్తున్నారు. 5ఏళ్ల క్రితం కరోనా వ్యాపించిన తొలినాళ్లతో పోలిస్తే, ఇప్పుడు మరింత ప్రిపేర్​ అయినట్టు అధికారులు చెబుతున్నారు.

డిసెంబర్​ 16-22 వారంలో ఇన్​ఫెక్షన్స్​తో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య పెరిగినట్టు డేటా చెబుతోంది. అయితే, శీతాకాలంలో ఊపిరితిత్తులకు సంబంధించి అనేక రోగాలు వెలుగులోకి రావొచ్చని చైనా భావిస్తోంది. కానీ గతంతో పోలిస్తే, ఈసారి కేసులు తక్కువగా ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.

అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ-వైరల్​ మందులు వేసుకుంటే పని జరిగిపోతుందని అనుకోకూడదని తేల్చిచెబుతున్నారు.

మరోవైపు చైనాలో తాజా పరిస్థితులపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డేటాను పెద్దగా బయటకు పెట్టిన దేశంగా చైనాకు గుర్తింపు ఉండటంతో ఈసారి ఇంకేమైనా దాస్తోందా? అని అనుమానాలు పెరుగుతున్నాయి.

కొవిడ్​తో ఉక్కిరిబిక్కిరి..

సరిగ్గా 5ఏళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్​ ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రాణాంతక వైరస్​ వ్యాప్తితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది. లాక్​డౌన్లు, మరణాలు, ఆరోగ్య సమస్యలతో ప్రపంచ జనాభా కొట్టుమిట్టాడింది. ఈ వైరస్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.