ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం దెబ్బకు పాక్ భయపడింది. అయితే ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ కోసం చైనా భారత్‌పై గూఢచర్యం చేసిందని ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. శాటిలైట్ డేటాను కూడా పంచుకుందని తెలిసింది. రక్షణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న 'సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్' నివేదికలో రెండు ప్రధాన విషయాలు వెల్లడయ్యాయి. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణలు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే చైనా పాత్రపై నివేదిక రావడం గమనార్హం.
పాకిస్థాన్‌ను గెలిపించడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేసిందని, కానీ ఈ రెండింటి బంధం భారత సైన్యం బలం ముందు నిలబడలేకపోయిందని నివేదిక బహిర్గతం చేసింది. సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా కచ్చితమైన దాడుల్లో అనేక మంది పెద్ద ఉగ్రవాదులను హతమార్చింది.
భారత సైనిక మోహరింపును పర్యవేక్షించడానికి పాకిస్థాన్ తన గగనతల రక్షణ, రాడార్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించడానికి చైనా సహాయపడిందని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా ఏప్రిల్ 22న కశ్మీర్‌లో పహల్గామ్ దాడి, తదనంతర ఘర్షణ జరిగిన 15 రోజుల్లోనే పాకిస్థాన్ ఉపగ్రహ నిఘా వ్యవస్థ భారతదేశంపై బాగా దృష్టి పెట్టడానికి చైనా సహాయపడింది.
చైనా నుంచి వచ్చిన ఆయుధాలను మాత్రమే తాము ఉపయోగించామని పాక్ పేర్కొంది. అదే సమయంలో ఈ నివేదిక పాక్ వాదనలను బట్టబయలు చేసింది. పాకిస్థాన్‌కు వ్యూహాత్మక, ఇంటెలిజెన్స్, సాంకేతిక సహాయాన్ని చైనా అందించిందని తెలిపింది.
ఈ సంఘర్షణను చైనా తన రక్షణ వ్యవస్థకు 'లైవ్ ఫైర్ టెస్టింగ్'గా భావించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే చైనాకు చెందిన అనేక వ్యవస్థలు విఫలమయ్యాయని ఇప్పుడు అంచనా. పాక్ నుంచి వచ్చే డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకోగల సామర్థ్యం భారత రక్షణ వ్యవస్థకు ఉందని నివేదిక పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోకి ప్రవేశించి ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరాలను సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా, పలువురు పాక్ సైనిక సిబ్బంది కూడా మృతి చెందారు.