Vellore: పాముకాటుతో చిన్నారి మృతి.. 10కిలోమీటర్లు మోసుకెళ్లిన తల్లి.. సరైన రోడ్డు లేకపోవడంతో..
Vellore: వెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. పాముకాటు కారణంగా ఓ చిన్నారి చనిపోయింది. అయితే, రోడ్డు సరిగా లేని కారణంగా ఆ చిన్నారి మృతదేహాన్ని 10 కిలోమీటర్ల పాటు మోసుకెళ్లారు తల్లి.

తమిళనాడులోని వెల్లూర్ (Vellore) జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ 18 నెలల బాలిక పాముకాటుతో మృతి చెందింది. ఆ కొండ ప్రాంతంలో సరైన రహదారి లేక ఆసుపత్రికి సరైన సమయానికి తీసుకెళ్లకపోవడంతో ఆ బాలిక కన్నుమూసింది. ఆసుపత్రి నుంచి తిరుగు ప్రయాణంలో అంబులెన్స్ సగం దారిలోనే దింపేయటంతో కూతురి మృతదేహాన్ని తల్లి సుమారు 10 కిలోమీటర్ల పాటు మోసి అలెరి గిరిజన గ్రామంలోని తమ ఇంటికి తీసుకెళ్లారు.
18 నెలల బాలిక ధనుష్క పాముకాటుకు గురికావటంతో తల్లిదండ్రులు, బంధువులు వెల్లూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే రోడ్డు సరిగా లేకపోవటంతో ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైంది. దీందో దారిమధ్యలోనే ధనుష్క కన్నుమూసింది. సరైన రహదారి లేని కారణంగా చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లటంలో ఆలస్యమైందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెల్లూర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఆ తర్వాత గ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే, ఆ గ్రామం కొండ ప్రాంతంలో ఉండటంతో అంబులెన్స్ దారి మధ్యలోనే వారిని దింపేసింది. దీంతో సుమారు 10 కిలోమీటర్ల పాటు ఆ బాలిక మృతదేహాన్ని ఆ తల్లి ఎత్తుకొని వెళ్లారు. గుండెల నిండా వేదనతో సుమారు రెండు గంటల పాటు బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లారు.
ఈ విషయంపై వెల్లూర్ జిల్లా కలెక్టర్ పీ కుమారవేల్ పాండియన్ స్పందించారు. ఆ గ్రామానికి రోడ్డు నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే, ప్రస్తుతం ఆ గ్రామానికి మినీ అంబులెన్స్ సౌకర్యం ఉందని, ఆశా వర్కర్లను వారు సంప్రదించి ఉంటే ప్రాథమిక చికిత్సతో పాటు మినీ అంబులెన్స్ సర్వీస్ పొందే అవకాశం ఉండేదని కలెక్టర్ అన్నట్టు రిపోర్టులు బయటికి వచ్చాయి. వారు ఆశా వర్కర్లను సంప్రదించకుండా మోటార్ సైకిల్‍పై ఆ బాలికను తీసుకెళ్లారని ఆయన చెప్పారు.
అన్నైకట్టు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాదకర ఘటనపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో బాధిస్తోందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.
“సరైన రహదారి లేని కారణంగా ఓ చిన్నారి మృతి చెందడం అసలు అమోదయోగ్యం కాదు. చిన్నారి మృతదేహాన్ని ఎత్తుకొని తల్లిదండ్రులు కిలోమీటర్ల పాటు నడవాల్సి రావడం మరింత బాధాకరమైన విషయం. ఎవరూ అనుభవించకూడని ఆపార దుస్థితి ఇది” అని అన్నామలై పేర్కొన్నారు.