CJI : కోర్టును ఎలా నడపాలో నాకు చెప్పొద్దు.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం-chief justice of india blasts lawyer for interruptions during neet case hearing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cji : కోర్టును ఎలా నడపాలో నాకు చెప్పొద్దు.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

CJI : కోర్టును ఎలా నడపాలో నాకు చెప్పొద్దు.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

Anand Sai HT Telugu

Supreme Court On NEET : నీట్ పరీక్ష వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. న్యాయవాదిపై సీజేఐ సీరియస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.

సుప్రీంకోర్టు

కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సుప్రీం కోర్టులు వాదనలు జరిగాయి. అయితే ఈ సమయంలో న్యాయవాది మాథ్యూస్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై. చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీట్ పరీక్ష రద్దుపై వాదనలు నడుస్తున్నాయి. వాదనలకు అవకాశం కల్పిస్తామని సీజేఐ పిటిషనర్ల తరఫున న్యాయవాది మాథ్యూస్‌కు చెప్పారు. కానీ ఆయన వినిపించుకోకుండా.. మా వాదనలు వినాలని సీజేఐని చాలాసార్లు అడిగారు. దీంతో జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును నడిపే విధానం మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. తమను న్యాయవదులెవరూ ఆదేశించలేరని సీరియస్ అయ్యారు.

నిజానికి మెుదట పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా వాదనలు కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మాథ్యూస్ కూడా కల్పించుకున్నారు. దీంతో ఇది కొన్నిసార్లు ఇదే రిపీట్ అయింది. దయచేసి కూర్చోవాలని సీజేఐ చెప్పారు. ఇలా అడ్డుతగులుతూ ఉంటే కోర్టు నుంచి పంపిచేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

అయితే దీనిపై మాథ్యూస్ కూడా స్పందించారు. గౌరవనీయులైన కోర్టు వారు నన్ను గౌరవించకుంటే వెళ్లిపోతానని చెప్పారు. నా వాదనలు వినడం లేదని చాలాసార్లు ఆరోపించారు. దీంతో సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కోర్ట్ ఇన్‌ఛార్జిని అని, తాను చెప్పేది వినాల్సిందేనని స్పష్టం చేశారు. న్యాయస్థానంలో 24 ఏళ్లుగా ఉంటున్నానని, కోర్టును ఎలా నడపాలో తనకు చెప్పొద్దని స్పష్టం చేశారు. నరేందర్ హుడా వాదనల తర్వాత మీది వింటామని పేర్కొన్నారు.

అయితే ఈ విషయం అక్కడితో సద్దుమణగలేదు.. 1979 నుంచి కోర్టును చూస్తున్నాను అని, తాను వెళ్లిపోతున్నట్టుగా చెబుతూ.. అన్యాయం చేస్తున్నారని మాథ్యూస్ మళ్లీ అన్నారు. దీంతో ఎన్టీఏ తరఫున న్యాయవాది తుషార్ మాట్లాడారు. న్యాయవాది తీరును ధిక్కార చర్యగా అభివర్ణించారు. తర్వాత న్యాయవాది మాథ్యుస్‌కు అవకాశం రావడంతో నాకు జరిగిన అవమానానికి గౌరవనీయులైన కోర్టు వారిని క్షమిస్తున్నా.. నా వాదనల నుంచి విరమిస్తున్నా అని తెలిపారు.

ఇక నీట్-యూజీ 2024పై మంగళవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను ఆషామాషీగా తీసుకోలేమని స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపరు విస్తృత స్థాయిలో లీక్ అయినట్లుగా తాము భావించడం లేదని పేర్కొంది. పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేసింది. మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

పరీక్ష ఫలితాలు తారుమారు అయ్యాయని లేదా పరీక్ష నిర్వహణలో వ్యవస్థాగత ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. 'ప్రశ్నాపత్రం విస్తృత స్థాయిలో లీక్ అయినట్లు రికార్డుల్లో ఉన్న డేటా సూచించడంలేదని, రికార్డుల్లో ఉన్న అంశాల ఆధారంగా నీట్ ను రద్దు చేయడం సమర్థనీయం కాదు. అవసరం లేదు.' అని సీజేఐ పేర్కొన్నారు. మళ్లీ కొత్తగా నీట్-యూజీని ఆదేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఈ పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.