ఎన్ఆర్ఐలకు రిమోట్ ఓటింగ్ అవకాశం కల్పించాలి.. ఎన్నికల్లో ఏఐ, బయోమెట్రిక్ రావాలి : సీఈసీ రాజీవ్ కుమార్
Chief Election Commissioner : ఎన్నికల ఖర్చు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఆర్థిక పారదర్శకత పాటించాలని సీఈసీ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐలకు ఓటింగ్‌పై కొత్త విధానం తీసుకురావాలని చెప్పారు.

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. అంతకు ఒక రోజు ముందు సోమవారం తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఎన్నికల కమిషన్‌లో మార్పులు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), వలస కార్మికులకు రిమోట్ ఓటింగ్‌కు కమిషన్ అవకాశం కల్పించాలని కుమార్ అన్నారు. బయోమెట్రిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎన్నికల్లో ఓట్లు వేయడం ద్వారా ఎన్నికల పారదర్శకతలో పెను విప్లవం తీసుకురావచ్చన్నారు.
ఏఐ రావాలి
ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. దేశం వెలుపల నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, రాష్ట్రం వెలుపల నివసిస్తున్న వలస కార్మికుల ఓటు హక్కుపై ఆయన మాట్లాడుతూ.. రిమోట్ ఓటింగ్ ద్వారా దాన్ని సాకారం చేయోచ్చన్నారు. ప్రవాస భారతీయులకు వారు ఉన్న చోటు నుంచి ఓటు హక్కు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద, పారదర్శకమైన ఎన్నికల వ్యవస్థ అని, దేశం ప్రజాస్వామ్యానికి దిక్సూచి అని రాజీవ్ కుమార్ అన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
ఎన్నికల ఖర్చు, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఆర్థిక పారదర్శకత పాటించాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్, ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను ప్రశ్నించిన పార్టీలు, ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నాయని ఆరోపించిన విషయాన్ని తన వీడ్కోలు ప్రసంగంలో గుర్తు చేశారు రాజీవ్ కుమార్. పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలకు దూరంగా ఉండాలని కోరారు.
ఆరోపణలు సరికాదు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచ దేశాలన్నింటికీ స్ఫూర్తిదాయకమన్నారు. మన ఈ సాఫ్ట్ పవర్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాజీవ్ కుమార్ కోరారు. ఎన్నికల సంఘం గురించి ఎప్పటికప్పుడు లేవనెత్తిన ప్రశ్నలను ఆయన ప్రస్తావిస్తూ.. ఒక సంస్థగా ఎన్నికల సంఘం తరచుగా అనవసరమైన ఆరోపణలను ఎదుర్కొంటుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి సిద్ధంగా లేని వ్యక్తుల నుండి ఈ ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కమిషన్‌ను లక్ష్యంగా చేసుకునే ధోరణి పెరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు.
సంబంధిత కథనం