Chhota Rajan: హత్య కేసులో ఛోటా రాజన్ కు యావజ్జీవ కారాగార శిక్ష-chhota rajan sentenced to life imprisonment for murder of mumbai hotelier ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhota Rajan: హత్య కేసులో ఛోటా రాజన్ కు యావజ్జీవ కారాగార శిక్ష

Chhota Rajan: హత్య కేసులో ఛోటా రాజన్ కు యావజ్జీవ కారాగార శిక్ష

HT Telugu Desk HT Telugu
May 30, 2024 04:13 PM IST

Chhota Rajan: అండర్ వరల్డ్ డాన్, ప్రముఖ గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ కు ఒక హత్య కేసులో ముంబై కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముంబైలోని ప్రముఖ హోటల్ ‘గోల్డెన్ క్రౌన్’ యజమాని జయ శెట్టి హత్య కేసులో ఛోటా రాజన్ ను దోషిగా నిర్ధారించి ఈ శిక్ష విధించింది.

గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ పాత ఫొటో
గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ పాత ఫొటో (PTI)

Chhota Rajan: 2001 లో జరిగిన హోటల్ వ్యాపారి జయ శెట్టి హత్య కేసులో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ ను దోషిగా తేల్చిన ముంబై కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (MCOCA) కింద నమోదైన కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఏఎం పాటిల్ ఛోటా రాజన్ ను దోషిగా తేల్చారు.

yearly horoscope entry point

జయ శెట్టి ఎవరు?

సెంట్రల్ ముంబైలోని గాంధేవీలో గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమాని జయ శెట్టి. ఛోటా రాజన్ (Chhota Rajan) గ్యాంగ్ నుంచి అతడికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కానీ, వాటిని ఆయన పట్టించుకోలేదు. దాంతో, 2001 మే 4న జయ శెట్టి హోటల్లో ఉండగా, ఆయన రూమ్ లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆయనను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. అనంతరం వారు పారిపోతుండగా, హోటల్ మేనేజర్, మరో ఉద్యోగి వారిని వెంబడించి వారిలో ఒకరిని పట్టుకున్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని జయ శెట్టి ప్రభుత్వాన్ని కోరగా, ఆయనకు మహారాష్ట్ర పోలీసులు భద్రత కల్పించారు. అయితే హత్యకు రెండు నెలల ముందు ఆయనకు కల్పించిన ఆ భద్రతను ఉపసంహరించుకున్నారు.

ప్రస్తుతం తిహార్ జైళ్లో..

2015 అక్టోబర్ లో ఇండోనేషియాలో ఛోటా రాజన్ (Chhota Rajan) ను అరెస్ట్ చేసి భారత్ కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఛోటా రాజన్ ఉన్నాడు. ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికాల్జే. ఆయనపై పలు హత్య, బెదిరింపు వసూళ్లు, దేశ ద్రోహం.. వంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి.

ఫిల్మ్ మేకర్ పై కోర్టుకు..

కాగా, 'స్కూప్ (scoop)' వెబ్ సిరీస్ నిర్మించిన ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా, మ్యాచ్ బాక్స్ షాట్స్ ఎల్ ఎల్ పీ యజమానులపై ఛోటా రాజన్ (Chhota Rajan) గత ఏడాది బాంబే హైకోర్టులో కేసు వేశారు. తన ఫొటోను, తన గొంతును తన అనుమతి లేకుండా ఆ వెబ్ సిరీస్ నిర్మాత ఉపయోగించారని రాజన్ తన దావాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సిరీస్ ను విడుదల చేయకుండా నిర్మాతలను శాశ్వతంగా నిరోధించాలని ఆయన కోర్టును కోరారు. తోటి జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే (జె డే) ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ జిగ్నా వోరా కథ ఆధారంగా ఈ నెట్ ఫ్లిక్స్ సిరీస్ ను రూపొందించారు. 2018లో ఈ కేసులో వోరా నిర్దోషిగా తేలగా, ఛోటా రాజన్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

Whats_app_banner