Chhattisgarh encounter : ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతం
Chhattisgarh encounter : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది సైతం మరణించారు.
మావోయిస్ట్ ఏరివేత ఆపరేషన్లో భాగంగా భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 12మంది మావోయిస్టులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
అయితే, ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్టు అధికారులు వివరించారు. గాయపడిన వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వివరించారు.
మరణించిన మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
మావోయిస్టుల ఏరివేత..
ఇదే బీజాపూర్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో 8మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్ట్ ఏరివేత ఆపరేషన్లో భాగంగా భద్రతా దళాలు- నక్సలైట్ల మధ్య ఎదురుకార్పులు జరిగాయి. ఫలితంగా 8మంది మరణించారు.
గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉదయం సమయంలో భద్రతా సిబ్బంది సంయుక్తంగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు జరిగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందరరాజ్ పీ తెలిపారు.
ఈ ఏడాది ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లతో 50కిపైగా మంది మావోయిస్టులు హతమయ్యారు. గత వారం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోలు చనిపోయారని మావోయిస్టులు ఒక ప్రకటనలో అంగీకరించారు. గత ఏడాది రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటటర్ లలో 219 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
2026 నాటికి నక్సలిజం ఉండదని, ఉండకూండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రతిజ్ఞకు అనుగుణంగా భద్రతా దళాలు గత కొంతకాలంగా మావోయిస్టులను ఏరివేస్తున్నారు.
సంబంధిత కథనం