Gang rape: 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం; ఆరుగురు మైనర్లు సహా ఏడుగురి అరెస్టు
చత్తీస్ గఢ్ లో మరో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారు. చత్తీస్ గఢ్ లోని జష్ పూర్ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
ఛత్తీస్ గఢ్ లోని జష్ పూర్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ బాలురు సహా ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పతల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన బాలిక సమీపంలోని మార్కెట్ లో జరిగే జాతరకు హాజరయ్యేందుకు వెళ్లింది.
పోలీసు కేసు
బాలిక సోమవారం సమీపంలోని సీతాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సుర్గుజా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) యోగేష్ పటేల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలిక ఆదివారం సాయంత్రం సమీప గ్రామంలో జరిగే జాతరకు వెళ్లింది. రాత్రి 8 గంటల సమయంలో తిరిగి వస్తుండగా బాలికను కిడ్నాప్ చేసిన నిందితులు అడవిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరితో తనకు పరిచయం ఉందని బాలిక తెలిపింది.
ఏడుగురి అరెస్ట్
ఆ బాలిక ఫిర్యాదు మేరకు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరకి మాత్రమే 18 ఏళ్లు దాటినట్లు, మిగతా ఆరుగురు 16 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లు అని ఎస్పీ తెలిపారు. పొరుగున ఉన్న జష్పూర్ జిల్లాలోని పాతాల్గావ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సీతాపూర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం జష్పూర్ పోలీసులకు బదిలీ చేయనున్నారు.