Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్; 12 మంది నక్సలైట్లు మృతి
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం బీకర ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతాదళాలు, నక్సలైట్ల మధ్య పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో12 మంది నక్సలైట్లు చనిపోయారు. నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దక్షిణ బీజాపూర్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం వరకు ఈ కాల్పులు కొనసాగాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) ఐదు బెటాలియన్లు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 229వ బెటాలియన్ సిబ్బందితో కూడిన సంయుక్త బృందం ఈ ఆపరేషన్లో పాల్గొంది.

12 మంది నక్సలైట్లు మృతి
భద్రతాదళాలు, నక్సలైట్ల మధ్య జరిగిన బీకర ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎన్ కౌంటర్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. గురువారం ఉదయం బీజాపూర్ లోని బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్కెల్ గ్రామ సమీపంలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
ఒక్క జనవరిలోనే 26 మంది..
ఛత్తీస్ గఢ్ లో ఈ జనవరి నెలలోనే వేర్వేరు ఎదురు కాల్పుల్లో (encounter) మొత్తం 26 మంది నక్సలైట్లు చనిపోయారు. జనవరి 12న బీజాపూర్లోని మడేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు నక్సలైట్లు హతమయ్యారు. జనవరి 11న బీజాపూర్ లో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఓ సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ లో రెండేళ్లలో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడిలో నక్సల్స్ 60 నుంచి 70 కిలోల బరువున్న ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ ను ఉపయోగించి వాహనాన్ని పేల్చివేశారని, ఈ నెల ప్రారంభంలో బీజాపూర్ జిల్లాలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది, వారి పౌర డ్రైవర్ మరణించారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఆపరేషన్లు పెరిగాయి. భద్రతా దళాలతో గత ఏడాది కాలంలో జరిగిన వివిధ ఎన్ కౌంటర్ లలో 219 మంది నక్సలైట్లు చనిపోయారు.