Chennai rains: చెన్నైకి వరద భయం; ఫ్లైఓవర్లపై కార్లు పార్క్ చేస్తున్న ప్రజలు
Chennai: రాబోయే 24 గంటల్లో తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని ప్రజలు తమ వాహనాలను ఫ్లైఓవర్లపై పార్క్ చేస్తున్నారు. దీనిపై ఇంటర్నెట్లో మీమ్స్ వెల్లువెత్తాయి.
Chennai rains: రానున్న 24 గంటల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. దాంతో చెన్నైలోని ప్రజలు, వరదల్లో తమ కార్లు కొట్టుకుపోకుండా, ముందు జాగ్రత్త చర్యగా ఫ్లైఓవర్లపై తమ వాహనాలను పార్క్ చేస్తున్నారు.
ఐఎండీ అలర్ట్
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు 24 నుంచి 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రతికూల వాతావరణానికి సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. అక్టోబర్ 15 మంగళవారం చెన్నైతో పాటు మరో 3 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 18 వరకు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించాలని ఈ జిల్లాల్లోని ఐటీ కంపెనీలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఫ్లై ఓవర్లపై పార్కింగ్
భారీ వర్షాలకు, వరద పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు సూచించింది. ఈ నేపథ్యంలో, భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి, ఆ వరదల్లో తమ కార్లు కొట్టుకుపోకుండా, చెన్నై (chennai) ప్రజలు కొత్త టెక్నిక్ ఫాలో అవుతున్నారు. తమ కార్లను సమీపంలోని ఫ్లై ఓవర్లపై ఒక పక్కగా, వరుసగా పార్క్ చేస్తున్నారు. గతంలో వరద నీటిలో మునిగిపోయి తమ కారు పాడయిందని, అందువల్ల ఫ్లై ఓవర్ పై పార్క్ చేస్తున్నానని ఒక చెన్నై వాసి చెప్పాడు. కార్లు ఫ్లైఓవర్ పై పార్క్ చేసి ఉన్న వీడియో వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
సోషల్ మీడియా (social media) యూజర్లలో ఎక్కువ మందిని ఈ ఫ్లై ఓవర్ పై కార్ల పార్కింగ్ ఐడియా ఆకట్టుకోగా, మరికొందరు ఈ పద్ధతిని తప్పుబట్టారు. ఫ్లై ఓవర్లపై కార్లు నిలపడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని పలువరు సోషల్ మీడియా యూజర్లు విమర్శించారు. ‘‘అప్పుడే వేలచ్చేరి బ్రిడ్జిపై కారు పార్క్ చేయడం ప్రారంభించారా?', అని ఓ యూజర్ ఫ్లైఓవర్ పై పార్క్ చేసిన వాహనాల వీడియో ను షేర్ చేస్తూ స్పందించారు.