Chennai Crime news: డాక్టర్ ను కత్తితో 7 సార్లు పొడిచి దాడి చేసిన పేషెంట్ కుమారుడు
Chennai Crime news: చెన్నైలోని ఒక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడిపై ఒక పేషెంట్ కుమారుడు కత్తితో దాడి చేశాడు. ఆ వైద్యుడిని కత్తితో ఏడు సార్లు పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలోని కేన్సర్ వార్డులో ఈ ఘటన జరిగింది.
Doctor stabbed in Chennai: చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ను ఒక రోగి కుమారుడు కత్తితో ఏడుసార్లు పొడిచాడు. దాంతో ఆ వైద్యుడికి మెడ, చెవి, నుదురు, వీపు, కడుపుపై గాయాలయ్యాయి. డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చెన్నైకి చెందిన నిందితుడు విఘ్నేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కీమోథెరపీ చేయించుకున్న తన తల్లికి ఆస్పత్రిలో సరైన వైద్యం అందించడం లేదనే కోపంతో డాక్టర్ పై విఘ్నేష్ దాడికి పాల్పడ్డాడు.
కేన్సర్ వార్డులో..
డాక్టర్ బాలాజీ చెన్నైలోని కలైంజ్ఞర్ సెంటినరీ ప్రభుత్వ ఆసుపత్రిలో కేన్సర్ (CANCER) వార్డులో పని చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడి వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు (tamil nadu news) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు తగిన చికిత్స అందించడంలో ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి వెలకట్టలేనిది. వారి భద్రతకు భరోసా కల్పించడం మన కర్తవ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని స్టాలిన్ అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ కూడా ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తమిళిసై సౌందరరాజన్ స్పందన
తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.ఈ ఘటన తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల అభద్రతా స్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. వైద్యులు రోగులందరినీ వివక్షారహితంగా ట్రీట్ చేస్తారని, వారిపై దాడులు చేయడం సరికాదని అన్నారు. ‘‘వైద్యులకు అభద్రతా భావం ఉండటం బాధాకరం. ఆయన పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. తమిళనాడు ప్రభుత్వం వైద్యుల భద్రతకు భరోసా ఇవ్వాలి’’ అన్నారు.