పవిత్ర చార్ధామ్ యాత్ర నిలిపివేత.. 57మంది యాత్రికులు మృతి!
Chardham yatra 2022 | పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 57మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా.. కేదార్‌నాథ్‌లో చార్ధామ్ యాత్రను అధికారులు సోమవారం నిలిపివేశారు.
Chardham yatra 2022 | భారీ వర్షాల కారణంగా.. ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లో చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. ఓవైపు తీవ్రమైన గాలులతో పాటు మంచు కురుస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఒక్క కేదార్నాథ్ మినహా.. గంగోత్రి, యమునోత్రి, హెమకుండ్ సాహెబ్, బద్రినాథ్ ప్రాంతాల్లో చార్ధామ్ యాత్ర కొనసాగుతోంది.
యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకునే.. కేదార్‌నాథ్‌లో చార్ధామ్ యాత్రను నిలిపివేసినట్టు జిల్లా యంత్రాగం చెప్పింది. ఉఖిమఠ్, సొనప్రయాగ్, గౌరికుండ్లకు విచ్చేసిన యాత్రికులు.. ఎక్కడివారక్కడే ఉండాలని సూచించింది. తదుపరి ఆదేశాలు అందేవరుకు కదలవద్దని వెల్లడించింది. కేదార్‌నాథ్‌కు వచ్చే మార్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజల ప్రయాణం మంచిది కాదని సూచించింది.
కాగా.. ప్రస్తుతం కేదార్‌నాథ్‌కు వెళ్లేందుకు 10వేల మందికిపైగా యాత్రికులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.
57మంది మృతి..
ఈ నెల 3న.. పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. కాగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 57మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. పలువురు.. గుండెపోటుతో మరణించారని, ఇంకొందరు పర్వతాలంటే భయంతో మృతిచెందారని వివరించారు.
ఆరెంజ్ అలర్ట్..
భారీ వర్షాల కారణంగా.. కేదార్‌నాథ్‌లో నిలిచిపోయిన యాత్రికులకు ఇప్పట్లో కష్టాలు తీరేలాగా లేవు! ఉత్తరాఖండ్‌లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో.. వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ఉంటుంది.
కాగా.. ఢిల్లీ, పంజాబ్, హరియాణాలకు జారీ చేసిన ఆరెంజ్ అలర్ట్‌ను ఎల్లో అలర్ట్‌గా మార్చింది ఐఎండీ.
సంబంధిత కథనం