Char Dham yatra registration: బద్రీనాథ్, కేదారినాథ్, గంగోత్రి, యమునోత్రి ల దర్శన భాగ్యం కలిగించే చార్ ధామ్ యాత్ర (Char Dham yatra)కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ రిజిస్ట్రేషన్ ను భక్తులు ఆన్ లైన్ లో కానీ, ఆఫ్ లైన్ లో కానీ చేసుకోవచ్చు.
చార్ ధామ్ యాత్ర (Char Dham yatra) చేస్తున్న భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చార్ ధామ్ యాత్ర ఏర్పాట్లపై గర్వాల్ డివిజన్ కమిషనర్ సుశీల్ కుమార్ సమీక్ష జరిపారు. ఫిబ్రవరి 20 నుంచి చార్ ధామ్ యాత్ర (Char Dham yatra) కు రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని సూచించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చార్ ధామ్ యాత్ర (Char Dham yatra) కోసం మార్చి 31 లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని సుశీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. యాత్ర రిజిస్ట్రేషన్ గురించి అన్ని రాష్ట్రాలకు సమాచారమివ్వాలని సూచించారు.
గత సంవత్సరం చార్ ధామ్ యాత్రను 46 లక్షల మంది భక్తులు పూర్తి చేశారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. నాలుగు పుణ్య క్షేత్రాలకు రోజువారీగా యాత్రికుల సంఖ్యను నిర్ధారించడంలో యాత్ర మార్గంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులకు సుశీల్ కుమార్ ఆదేశాలిచ్చారు. యాత్ర మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
అనేక కష్టనష్టాలకు ఓర్చి చార్ ధామ్ యాత్ర (Char Dham yatra) కు వస్తున్న భక్తులకు తృప్తిగా దర్శన భాగ్యం కలిగించాలని బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయ కమిటీలకు కమిషనర్ సుశీల్ కుమార్ సూచించారు. అందుకు అనుగుణంగా, రోజువారీ భక్తుల సంఖ్యను నిర్ధారించాలని సూచించారు. రోజుకు 12 వేల మంది భక్తులు వస్తే, వారికి, ఒక్కొక్కరికి 3 నుంచి 5 సెకన్ల సమయం మాత్రమే దర్శనం లభిస్తుందని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ సీఈఓ యోగేంద్ర సింగ్ వివరించారు. హిందూ సంప్రదాయం ప్రకారం, చార్ ధామ్ యాత్ర (Char Dham yatra)ను యమునోత్రి (Yamunotri)తో ప్రారంభించి, గంగోత్రి (Gangotri), కేదారనాథ్ (Kedaranath) ల్లో దర్శనం అనంతరం చివరగా బద్రీనాథ్ (Badrinath) కు వెళ్లాలి.