Chandrayaan-3: చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ మరో కీలక ఆవిష్కరణ; భూమిపై మాదిరిగానే.
Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఆవిష్కరణ చోటు చేసుకుంది. భూమిలో ప్రకంపనలు చోటు చేసుకునే విధంగానే, చంద్రుడిపై కూడా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని విక్రమ్ ల్యాండర్ గుర్తించింది.
Chandrayaan-3: భూమిలోపల నిత్యం ప్రకంపనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వాటి తీవ్రత పెరిగినప్పుడు భారీ భూకంపాలుగా తీవ్రమైన ఆస్తి, ప్రాణ నష్టాలను కలగజేస్తాయి. అదే విధంగా చంద్రుడి లోపలి పొరల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్ గర్తించింది. ఈ మేరకు చంద్ర ప్రకంపనలను రికార్డు చేసింది.
విక్రమ్ ల్యాండర్ లోని పేలోడ్స్
ఆగస్ట్ 23న చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, అందులో నుంచి వెలుపలికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై కలియతిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్ లు చందమామ గురించిన పలు నూతన విషయాలను వెల్లడిస్తున్నాయి. చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్, సిలికాన్, ఐరన్ వంటి మూలకాలు ఉన్నట్లు ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించింది. తాజాగా, విక్రమ్ ల్యాండర్ లోని ఇల్సా (Instrument for the Lunar Seismic Activity - ILSA) పేలోడ్ ద్వారా చంద్రుడిపై ప్రకంపనలను రికార్డు చేశారు. వాటిని రోవర్ మూవ్మెంట్ ద్వారా వచ్చిన ప్రకంపనలు కాకుండా, సహజసిద్ధమైన ప్రకంపనలుగా నిర్ధారించారు. విక్రమ్ ల్యాండర్ లోని మరో పేలోడ్ రేంభా ఎల్పీ (RAMBHA-LP) చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ప్లాస్మా వాతావరణాన్ని విశ్లేషిస్తోంది.