Chandrayaan-4 : చంద్రయాన్ 4 మిషన్‌లో ఇస్రో బిగ్ స్టెప్.. చంద్రుడి నుంచి అవి తీసుకొచ్చేలా ప్లానింగ్!
Chandrayaan-4 : ఇస్రో చంద్రయాన్ 4 మిషన్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ వి. నారాయణన్.. భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాల గురించి సమాచారం అందించారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్-3 మిషన్‌ను చంద్రునిపై విజయవంతంగా దిగడంతో చరిత్ర సృష్టించింది. ఈ విజయం తర్వాత ఇస్రో తన తదుపరి మిషన్‌లో నిమగ్నమై ఉంది. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-4 మిషన్‌పై నిరంతరం కృషి చేస్తున్నారు. దీని ప్రారంభ తేదీపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అయితే చంద్రయాన్-4 మిషన్ 2027లో ప్రారంభిస్తారని స్పష్టమైంది.
నమూనాలు తీసుకురానున్న చంద్రయాన్ 4
చంద్రయాన్ 3 సాధించిన విజయాలను మించి చంద్రయాన్ 4 మిషన్ ముందుకు సాగుతుందని ఇస్రో చైర్మన్ చెప్పారు. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితల ఖనిజాలు, ఉష్ణ ప్రవణతలు(Thermal Gradients), ఎలక్ట్రాన్ క్లౌడ్స్, సిస్మిక్ యాక్టివిటీస్ వంటి అనేక ముఖ్యమైన సమచారం అందించింది. అయితే చంద్రయాన్ 4 చంద్రుని దక్షిణ ధ్రువం(సౌత్ పోల్)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమే కాకుండా చంద్రుని ఉపరితలం నమూనాలను సేకరించి వాటిని తిరిగి భూమికి తీసుకువస్తుందని ఆశిస్తున్నారు. చంద్రుని నుంచి రాళ్ల నమూనాలు, మట్టిని సేకరించి.. భూమికి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇస్రో చైర్మన్ నారాయణ్ చెప్పారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై
ఈ మిషన్‌లో ఐదు మాడ్యూళ్ల సంక్లిష్టమైన అసెంబుల్ ఉంటుంది. వీటిని రెండు రాకెట్లను ఉపయోగించి ప్రయోగిస్తారు. ఇస్రో చేపట్టిన మునుపటి చంద్రయాన్ మిషన్ల కంటే ఇది చాలా పెద్ద మార్పు. చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనలు నిర్వహించడానికి చంద్రయాన్ 4 మిషన్‌ను పంపనున్నట్లు నారాయణన్ తెలిపారు. ఈ మిషన్ కింద, 9,200 కిలోల ఉపగ్రహాన్ని రెండు మార్క్-III రాకెట్ల ద్వారా ప్రయోగిస్తారు. రెండు మాడ్యూల్స్ చంద్రుని కక్ష్యలో కలుస్తాయి. రెండు మాడ్యూల్స్ చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహిస్తాయి. ఒక మాడ్యూల్ చంద్రుని ఉపరితలం నుండి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకువస్తుంది.
చంద్రయాన్ 4 బడ్జెట్
చంద్రయాన్ 4 మిషన్ ఒకేసారి ప్రారంభించరు. దీనిని రెండు భాగాలుగా మెుదలుపెడతారు. తరువాత దాని మాడ్యూల్స్ అంతరిక్షంలో చేరతాయి. అక్కడ డాకింగ్ జరుగుతుంది. చంద్రయాన్ 4 మిషన్‌కు ప్రభుత్వం రూ.2104.06 కోట్ల నిధిని అందిస్తోంది. ఇందులో చంద్రయాన్-4 అంతరిక్ష నౌక, రెండు LVM-3 రాకెట్లు, చంద్రయాన్-4తో నిరంతరాయంగా కమ్యూనికేషన్, డిజైన్ ధృవీకరణను నిర్వహించడానికి అంతరిక్ష నెట్‌వర్క్ ఉన్నాయి.