శాసనసభలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లపై గడువు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇది మునుపటి సుప్రీంకోర్టు ఆదేశానికి భిన్నంగా ఉంది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి మూడు నెలల గడువు, గవర్నర్లకు ఒక నెల గడువును ఏప్రిల్‌లో న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నిర్దేశించింది.
అయితే ఈ సందర్భంగా బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు నిర్దేశించవచ్చా అనే విషయంపై అభిప్రాయాలను సుప్రీం కోర్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై కేంద్రం సుప్రీం కోర్టుకు లిఖితపూర్వక వివరాలు సమర్పించిందని ఎన్డీటీవీ పేర్కొంది. రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టులకు లేదని కేంద్రం తెలిపింది. కొన్ని విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
బిల్లుల ఆమోద ప్రక్రియ అమలులో కొన్ని పరిమిత సమస్యలు ఉన్నప్పటికీ.. గడువు విధించడం వల్ల రాష్ట్రపతి, గవర్నర్లు పదవిని తగ్గించినట్టుగా అవుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లిఖితపూర్వక వివరాల్లో పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలు ప్రజాస్వామ్య పాలన యొక్క ఉన్నత ఆదర్శాలను సూచిస్తాయని చెప్పారు. ఏవైనా లోపాలు ఉంటే అనవసరమైన న్యాయ జోక్యాల ద్వారా కాకుండా రాజ్యాంగ యంత్రాంగాల ద్వారా సరిదిద్దుకోవాలని ఈ మేరకు కేంద్రం పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం.. గవర్నర్ శాసనసభ సమర్పించిన బిల్లులకు ఆమోదం తెలియజేయవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు వాయిదా వేయవచ్చు లేదా రిజర్వ్ చేయవచ్చు. పునఃపరిశీలన కోసం దానిని సభకు తిరిగి పంపవచ్చు, కానీ మళ్ళీ ఆమోదం పొందితే, గవర్నర్ సమ్మతిని నిలిపివేయకూడదు. రాజ్యాంగానికి రాష్ట్ర విధాన సూత్రాలకు విరుద్ధంగా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడాన్ని కూడా గవర్నర్ ఎంచుకోవచ్చు.
తమిళనాడుకు సంబంధించిన ఒక కేసులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులో సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను నియంత్రించాలని కోరింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి తన వద్దే ఉంచుకోవడం సరికాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బిల్లులను మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పిపంపడమో చేయాలని చెప్పింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయడానికి కాలక్రమాన్ని అనుసరించాలని ఆదేశించింది.
గడువుపై గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేనప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని అడిగారు. జూలైలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆదేశించింది.