వరితో పాటు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం-centre raises msp for kharif crops ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వరితో పాటు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

వరితో పాటు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం

Sudarshan V HT Telugu

2025-26 మార్కెటింగ్ సీజన్లో 14 ప్రధాన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.

ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం (Basit Zargar)

2025-26 మార్కెటింగ్ సీజన్లో 14 ప్రధాన ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీని సవరిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధికంగా ఒడిశలు (క్వింటాలుకు రూ.820), రాగులు (క్వింటాలుకు రూ.596), పత్తి (క్వింటాలుకు రూ.589), నువ్వులు (క్వింటాలుకు రూ.579) పంటలకు మద్దతు ధరను పెంచాలని సిఫార్సు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

వరి మద్దతు ధర పెంపు

వరి ధాన్యానికి కనీస మద్ధతు ధరను క్వింటాలుకు రూ.69 పెంచారు. ఈ 3% పెంపు అనంతరం వరి కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,369కి చేరింది. పప్పుదినుసుల్లో కందిపప్పుపై క్వింటాలుకు రూ.450 పెంచారు. ఈ పెంపుతో క్వింటాలు కందుల ఎంఎస్పీ రూ. 8 వేలకు చేరుతుంది. పెసరపై క్వింటాలుకు రూ.86 పెంచి రూ. 8768 చేశారు. మినుములకు ఎంఎస్పీని క్వింటాలుకు రూ.400 పెంచి, రూ. 7,800 చేశారు. నూనెగింజల విషయానికొస్తే వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటల కనీస మద్దతు ధరను వరుసగా క్వింటాలుకు రూ.480, రూ.441, రూ.436 పెంచారు.

కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా

2025-26 మార్కెటింగ్ సీజన్లో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఉంది, ఇది అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు ఉంటుంది. సజ్జలు (63 శాతం), మొక్కజొన్న (59 శాతం), కంది (59 శాతం), పెసర (53 శాతం) పంటలకు ఉత్పత్తి వ్యయంపై రైతులకు ఆశించిన మార్జిన్ ఎక్కువగా ఉంటుందని అంచనా. మిగిలిన పంటలకు ఉత్పత్తి వ్యయంపై రైతులకు మార్జిన్ 50 శాతంగా అంచనా వేశారు. "ఇటీవలి సంవత్సరాలలో, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు మరియు న్యూట్రి-తృణధాన్యాలు / శ్రీ రైస్ వంటి తృణధాన్యాలు కాకుండా ఇతర పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది, ఈ పంటలకు అధిక ఎంఎస్పిని అందిస్తోంది" అని ప్రభుత్వం తెలిపింది.

7,608 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ

2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో ధాన్యం సేకరణ 7,608 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2004-05 నుంచి 2013-14 వరకు 4,590 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో 14 ఖరీఫ్ పంటల సేకరణ 7,871 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2004-05 నుంచి 2013-14 వరకు 4,679 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో వరి పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం రూ.14.16 లక్షల కోట్లు కాగా, 2004-05 నుంచి 2013-14 వరకు రైతులకు చెల్లించిన మొత్తం రూ.4.44 లక్షల కోట్లు. 2014-15 నుంచి 2024-25 మధ్య కాలంలో 14 ఖరీఫ్ పంటలకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం రూ.16.35 లక్షల కోట్లు కాగా, 2004-05 నుంచి 2013-14 మధ్య రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం రూ.4.75 లక్షల కోట్లు.

మూడు పంట కాలాలు

భారతదేశంలో మూడు పంట కాలాలు ఉన్నాయి. అవి వేసవి, ఖరీఫ్, రబీ. జూన్-జూలైలో నాటి, రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఖరీఫ్ పంటలు అక్టోబరు-నవంబరులో కోతకు వస్తాయి. అక్టోబరు-నవంబరులో వేసిన రబీ పంటలు వాటి పరిపక్వతను బట్టి జనవరి నుంచి కోతకు వస్తాయి. రబీ, ఖరీఫ్ సీజన్ల మధ్య వేసవి పంటలు పండిస్తారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.