Ban on rice: బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. కానీ భారీగా ఎంఈపీ-centre lifts ban on rice export after one year but imposed mep of 490 dollars a tonne ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ban On Rice: బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. కానీ భారీగా ఎంఈపీ

Ban on rice: బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం.. కానీ భారీగా ఎంఈపీ

Sudarshan V HT Telugu
Sep 28, 2024 08:48 PM IST

బాస్మతి బియ్యాన్ని మినహాయించి మిగతా బియ్యం వెరైటీల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది. దేశీయంగా బియ్యం ధరలను నియంత్రించడానికి బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై గత ఏడాది ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు ఎగుమతులపై విధించిన ఆంక్షలను భారత్ క్రమంగా తొలగిస్తోంది.

బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం
బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం

బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతులపై ఏడాది క్రితం విధించిన నిషేధాన్నికేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దేశీయంగా ధరల పెరుగుదలను అరికట్టడానికి గత సంవత్సరం జులైలో బాస్మతి మినహా మిగతా బియ్యం వెరైటీల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా, కీలక వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే వాణిజ్య విధానాన్ని మార్చింది.

ఎంఈపీ టన్నుకు 490 డాలర్లు

అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులను అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కానీ, తక్షణమే అమల్లోకి వచ్చేలా టన్నుకు కనీస ఎగుమతి ధర లేదా ఎంఈపీగా (minimum export price) 490 డాలర్లని విధించింది. ఎంఈపీ అనేది ఒక ఉత్పత్తిని విదేశీ కొనుగోలుదారులకు విక్రయించడానికి ఉద్దేశించిన నిర్ణీత కనీస ధర. అంటే, ఈ ధర కన్నా తక్కువ ధరకు ఎగుమతి చేయడానికి వీలు లేదు. అతి తక్కువ ధరలకే భారీగా ఎగుమతులు చేయడాన్ని నిరోధించడానికి ఎంఈపీలను నిర్ణయిస్తారు.

వాణిజ్య విధానంలో మార్పులు

గత కొన్నేళ్లుగా అధిక ఆహార ద్రవ్యోల్బణాన్ని (INFLATION) నియంత్రించేందుకు ఎగుమతులపై విధించిన ఆంక్షలను భారత్ క్రమంగా తొలగిస్తోంది. ఆగస్టులో వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్ఠ స్థాయి 3.65 శాతానికి తగ్గింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో 9.94 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం 5.35 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ 14న ప్రభుత్వం బాస్మతి ఎగుమతులపై 950 డాలర్ల ఎంఈపీని రద్దు చేసింది. విదేశీ ఉల్లి అమ్మకాలపై టన్నుకు 550 డాలర్ల ఎంఈపీని కూడా అధికారులు తొలగించారు.

అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారు

ప్రపంచంలోని అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారు అయిన భారత్ గత ఏడాది డిసెంబరులో దేశీయ సరఫరాను పెంచడానికి, దేశీయంగా ధరలను తగ్గించడానికి ఉల్లి (ONION) ఎగుమతులను నిషేధించింది. ఈ సంవత్సరం మే 4, 2024 న మళ్లీ ఉల్లి ఎగుమతులను అనుమతించారు. కానీ ఎంఈపి ప్లస్ 40% టారిఫ్ విధించారు. ఇతర దేశాల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు మన దేశంలో ఉన్నందున అలాంటి ఎగుమతులను అనుమతించాలా వద్దా అని ఆలోచిస్తున్నామని ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 24న చెప్పారు.

అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు

ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత్ ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2021-22లో దేశం దాదాపు 22 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసింది. ఇది దాని మొత్తం దేశీయ ఉత్పత్తిలో ఆరవ వంతు. గత జూలైలో బాస్మతియేతర తెల్ల బియ్యం (RICE) ఎగుమతిని పరిమితం చేసిన తరువాత ఏప్రిల్-జూన్లో బియ్యం ఎగుమతులు దాదాపు 34% క్షీణించి 3.2 మిలియన్ టన్నులకు పడిపోయాయి.