Antibiotic: ‘‘ఈ యాంటీబయాటిక్ తో జాగ్రత్త.. తీవ్రమైన సమస్యలు వస్తాయి’’- కేంద్రం హెచ్చరిక
భారత్ లో అత్యంత ఎక్కువగా ఉపయోగించే ఒక యాంటి బయాటిక్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (IPC) ఒక అలర్ట్ జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది.
టైఫస్, టిక్ ఫీవర్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కలరా, మలేరియా చికిత్సలో విరివిగా ఉపయోగించే యాంటి బయాటిక్ ‘టెట్రాసైక్లిన్’ వినియోగంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (Indian Pharmacopoeia Commission IPC) ఒక అలర్ట్ జారీ చేసింది. ఈ ఔషధాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, రోగులకు సూచించింది.
టెట్రాసైక్లిన్ తో జాగ్రత్త
టెట్రాసైక్లిన్ వినియోగం వల్ల తీవ్రమైన రియాక్షన్స్ వచ్చే ప్రమాదముందని ఐపీసీ (IPC) హెచ్చరించింది. ముఖ్యంగా, చర్మానికి సంబంధించిన రియాక్షన్ ఎక్కువగా వస్తుందని, వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుందని తెలిపింది. టెట్రాసైక్లిన్, ఇతర యాంటీబయాటిక్స్ మాదిరిగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రమే ఇవ్వాల్సిన ఔషధం. రాకీ మౌంటెన్ మచ్చల జ్వరం, టైఫస్, క్యూ జ్వరం, రికెట్సియల్ పాక్స్, రికెట్సియా వల్ల కలిగే టిక్ జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటికి చికిత్స చేయడానికి ఉపయోగించే టెట్రాసైక్లిన్ వల్ల డ్రగ్ రియాక్షన్ జరుగుతోందని తమ అధ్యయనంలో తేలిందని ఐపీసీ వెల్లడించింది.
రియాక్షన్లపై సమాచారం ఇవ్వండి
టెట్రాసైక్లిన్ (Tetracycline)వాడకానికి సంబంధించి ఏవైనా రియాక్షన్లను గుర్తిస్తే వెంటనే చికిత్స ప్రారంభించడంతో పాటు ఐపీసీకి సమాచారం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్న దేశం భారత్. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ ప్రకారం, భారత్ లో 2024 ఆర్థిక సంవత్సరంలో యాంటీ ఇన్ఫెక్టివ్ విభాగం మార్కెట్ పరిమాణం సుమారు రూ .25,130 కోట్లు.
ఏమిటీ ఐపీసీ
భారతీయులలో వివిధ ఔషధాల వల్ల వచ్చే రియాక్షన్స్ పై ఐపీసీ (Indian Pharmacopoeia Commission IPC) అధ్యయనం చేస్తుంది. ఆయా మందుల సురక్షిత ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కు సూచనలు చేస్తుంది. భారత్ లో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే, యాంటి బయాటిక్స్ ను విచ్చలవిడిగా వాడతుంటారు. మార్కెట్లో అనుమతి లేని యాంటీబయాటిక్ (ANTIBIOTIC) కాంబినేషన్లను చెక్ చేయాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర లైసెన్సింగ్ అధికారులను ఆదేశించారు.