CBSE news: నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (NCFSE) సిఫార్సు మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో చదువుతున్న 12 వ తరగతి విద్యార్థులకు 2026 విద్యా సంవత్సరం నుంచి జూన్ నెలలో రెండవ బోర్డు పరీక్షను షెడ్యూల్ చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికను అనుసరించే 12వ తరగతి విద్యార్థి ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరి లేదా మార్చిలో బోర్డు పరీక్షకు హాజరవుతాడు. 12 వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే నెలలో ప్రకటిస్తారు. విద్యార్థి ఆశించిన విధంగా స్కోరు చేయకపోతే, వారు జూలైలో జరిగే "సప్లిమెంటరీ పరీక్షలకు" హాజరయ్యే అవకాశం ఉంది. అయితే, ఇలా ఒక సబ్జెక్ట్ కు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు జూలై 15న జరిగాయి.
అయితే, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి ద్వైవార్షిక బోర్డు పరీక్షలను నిర్వహించాలని కొత్త జాతీయ విద్యావిధానం 2020లో సిఫారసు చేశారు. సిలబస్ కూడా ఎక్కువగా ఉండకుండా చూడాలని సూచించారు. ఎన్ఈపీ 2020 ప్రకారం, 2026 నుండి ప్రతి సంవత్సరం 12 వ తరగతి విద్యార్థులకు రెండు బోర్డు పరీక్షలను నిర్వహించడానికి ఒక ప్రతిపాదనను సిద్ధం చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ సీబీఎస్ఈ ని కోరింది.
రెండు బోర్డుల పరీక్షా విధానంలో సీబీఎస్ఈ (CBSE) మొదటి పరీక్ష ఫిబ్రవరి-మార్చిలో, రెండో సెట్ పరీక్ష జూన్లో నిర్వహించే అవకాశం ఉంది. 12వ తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ఒక సబ్జెక్టుకు మాత్రమే సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా విద్యార్థి కోరుకున్న అన్ని సబ్జెక్టులకు 'సప్లిమెంటరీ పరీక్షలు' లేదా 'ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్'కు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రెండో విడత బోర్డు పరీక్షలను నిర్వహించడానికి 15 రోజులు, ఫలితాలను ప్రకటించడానికి సుమారు నెల రోజుల సమయం సీబీఎస్ఈకి పడుతుంది. అంటే జూన్ లో పరీక్షలు నిర్వహిస్తే ఆగస్టులో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ప్రవేశ పరీక్షల షెడ్యూలు, మార్కింగ్ కోసం ఉపాధ్యాయులపై భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి లోపు మొదటి బోర్డు పరీక్షను నిర్వహించవద్దని ప్రభుత్వం సిఫార్సు చేసింది. విద్యార్థులందరూ రెండో బోర్డు పరీక్షలకు హాజరు కారని, దీనివల్ల ఉపాధ్యాయులపై మూల్యాంకన భారం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. జాతీయ విద్యావిధానం 2020 ఆధారంగా రూపొందించిన ఎన్సీఎఫ్ఎస్ఈ ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండాలని, ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.