Unified Pension Scheme: ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’ కు కేంద్రం ఆమోదం; శాలరీలో కనీసం 50% పెన్షన్
Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ పెన్షన్ పథకం వల్ల సుమారు 23 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ గా లభిస్తుంది.
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో 50 శాతం పెన్షన్ ఇస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
అనేక సంప్రదింపుల తరువాత..
కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.కొత్త పెన్షన్ స్కీమ్ గురించి వివరిస్తూ, ‘‘కొత్త పెన్షన్ పథకంలో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దాంతో, కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ సంస్థలతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలతో 100కు పైగా సమావేశాలు నిర్వహించింది. ఆ తరువాత ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను సిఫారసు చేసింది’’ అని వివరించారు.
మోదీ పనితీరుకు నిదర్శనం
‘‘ప్రధాని మోదీ పనిచేసే విధానానికి, ప్రతిపక్షాల పనితీరుకు తేడా ఉంది. ప్రతిపక్షాలకు భిన్నంగా ప్రధాని మోదీ (Narendra Modi) ఏ విషయంలో అయినా విస్తృత సంప్రదింపులు జరపిన తరువాతనే నిర్ణయం తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రపంచ బ్యాంకుతో సహా అందరితో సంప్రదింపుల తరువాత, కమిటీ ఈ ఏకీకృత పెన్షన్ పథకాన్ని సిఫారసు చేసింది. ఈ రోజు కేంద్ర కేబినెట్ ఈ ఏకీకృత పెన్షన్ పథకానికి ఆమోదం తెలిపింది, భవిష్యత్తులో ఇది అమలు చేస్తాం’’ అని మంత్రి తెలిపారు.
ఈ పథకానికి కీలకం 50 శాతం పెన్షన్
ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు పునాది "50% పెన్షన్ హామీ అని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘‘50% పెన్షన్ ఈ పింఛను పథకానికి ఫస్ట్ పిల్లర్... కుటుంబ పింఛన్ రెండో పిల్లర్. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 23 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఉద్యోగులు ఎన్పీఎస్ (NPS), యూపీఎస్ (UPS) లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ఈ ఏకీకృత పెన్షన్ పథకానికి మొత్తం ఐదు పిల్లర్స్ ఉంటాయి. అందులో కీలకమైనది వేతనంలో 50 శాతం పెన్షన్. ఈ పెన్షన్ మొత్తం పదవీ విరమణకు ముందు 12 నెలల బేసిక్ వేతనం యొక్క సగటులో 50%. ఎవరైనా 25 ఏళ్లు పనిచేస్తే ఆ వ్యక్తికి ఈ హామీ పింఛను మొత్తం లభిస్తుంది’’ అని వివరించారు.