Govt Hospitals : అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25 శాతం భద్రత పెంపు
Kolkata Doctor Rape Case : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆసుపత్రుల్లో భద్రత పెంపునకు ఆమోదం తెలిపింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తరువాత వైద్య సంఘాలన డిమాండ్ల నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతను 25 శాతం పెంచడానికి ఆమోదించింది. ప్రభుత్వ ఆసుపత్రుల నుండి వ్యక్తిగత అభ్యర్థనల ఆధారంగా వారి భద్రతా పెంచే అవకాశం కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
వైద్యు సంఘాల వాదనను కొంతమంది అధికారులు తప్పుబడుతున్నారు. వైద్యులు, ఆసుపత్రులపై దాడులను నిరోధించేందుకు ముసాయిదా బిల్లును వెంటనే చట్టరూపంలోకి తీసుకురావాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి ఘటన రోగులు, వైద్యుల మధ్య జరిగింది కాదని.. ముసాయిదా బిల్లుతో లంకె పెట్టడం సరికాదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక, కేరళ సహా 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని రక్షించడానికి చట్టాలను రూపొందించాయని ఓ అధికారి తెలిపారు. ఈ అన్ని రాష్ట్రాల్లో ఈ నేరాలు గుర్తించదగినవి, నాన్ బెయిలబుల్ అని వెల్లడించారు.
పలు అంశాలను వివరించేందుకు కొన్ని రెసిడెంట్స్ డాక్టర్ల సంఘాలతో సమావేశమైనట్లు అధికారులు తెలిపారు. డ్యూటీ రూమ్‌లు, పని గంటలు, పరిస్థితులు, క్యాంటీన్ సేవలతో సహా ఆసుపత్రి భద్రత, నివాసితుల సౌకర్యాల వివిధ అంశాలను సమీక్షించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు .
ఆర్‌జి కర్ ఆసుపత్రి ఘటన తర్వాత ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై జరిగే హింసను పరిష్కరించడానికి, వైద్య సదుపాయాలలో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి మెరుగైన భద్రతా కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరగా అమలు చేయాలని దేశవ్యాప్తంగా వైద్యులు పిలుపునిచ్చాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇందులో ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింసను ఎదుర్కోవడానికి కేంద్ర చట్టం, తప్పనిసరి భద్రతా చర్యలతో ఆసుపత్రులను సేఫ్ జోన్‌లుగా పేర్కొనడం వంటివి ఉన్నాయి.