PM KISAN Nidhi : రైతులకు కేంద్రం త్వరలో గుడ్ న్యూస్, పీఎం కిసాన్ నిధి కింద మరో రూ. 2 వేలు!
PM KISAN Nidhi : దేశంలోని రైతులందరికీ కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధి మొత్తాన్ని మరో రూ.2 వేలు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.
PM KISAN Nidhi : రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. 2024 ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ. 6 వేలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి అదనంగా మరో రూ.2 వేలు రైతులకు అందించనుందని తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది. దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 65 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలంటే గ్రామీణ ఓట్లు కీలకం. గ్రామీణ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ సర్కార్ కిసాన్ నిధిని పెంచే యోచనలో ఉందని తెలుస్తోంది.
పీఎం కిసాన్ నిధి పథకం
దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద సంవత్సరానికి కనీస ఆదాయానికి మద్దతుగా రూ.6,000 అందిస్తుంది కేంద్రం. ఈ పథకాన్ని ఫిబ్రవరి 1, 2019న మధ్యంతర కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. పీఎం కిసాన్ పథకానికి వార్షిక వ్యయం రూ. 75,000 కోట్లుగా బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు మూడు సమాన వాయిదాలలో ఏటా రూ.6 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం. దాదాపు 8 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.16,800 కోట్లు జమ చేసింది. రైతులు పీఎం కిసాన్ యోజన కోసం కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు. MKISAN పోర్టల్ లో ఓటీపీ ఆధారిత సాంకేతికతను ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
11 కోట్ల అన్నదాత కుటుంబాలకు లబ్ది
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ ప్రకారం.. పీఎం కిసాన్ పథకంతో ఇప్పటి వరకు 11 కోట్లకు పైగా అన్నదాత కుటుంబాలు లబ్ధి పొందాయి. రూ. 2.25 లక్షల కోట్ల నిధులు రైతులకు చేరాయి. కోవిడ్ సంక్షోభంలో రైతులకు రూ 1.75 లక్షల కోట్ల డబ్బులు అందాయి. ఇక ఈ పథకంలో భాగంగా 3 కోట్లకుపైగా మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 53,600 కోట్లు జమ అయ్యాయి. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశ వ్యాప్తంగా వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికి ఆర్థికంగా మద్దతిచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులతో రైతులు.. తమ పొలానికి సంబంధించిన అవసరాలను తీర్చుకోవడంతో పాటు, విద్య, పెళ్లి, వైద్యం వంటివి కూడా సమకూర్చుకోవచ్చు.