RSS Ban lifted : ఆర్ఎస్ఎస్కి సంబంధించిన దశాబ్దాల నాటి నిషేధం ఎత్తివేత! ప్రభుత్వ ఉద్యోగులు ఇక..
RSS Ban lifted : ఆర్ఎస్ఎస్కి సంబంధించిన దశాబ్దాల నాటి నిషేధాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం ఎత్తివేసింది! ప్రభుత్వ ఉద్యోగులు ఇక నుంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఇప్పటివరకు ఉన్న నిషేధాన్ని బీజేపీ ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసినట్టు తెలుస్తోంది! ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను చూపిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్.
కాంగ్రెస్ నేత షేర్ చేసిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జులై 9న జారీ చేసినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్లో పాల్గొనకుండా 1966 నాటి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది.
1966 నాటి నిషేధం ఎత్తివేత..!
మహాత్మా గాంధీ మరణం అనంతరం ఆర్ఎస్ఎస్పై 1948లో నిషేధం పడింది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
"మహాత్మా గాంధీ హత్య అనంతరం 1948 ఫిబ్రవరిలో ఆర్ఎస్ఎస్ని సర్దార్ పటేల్ నిషేధించారు. అనంతరం కాలంలో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత కూడా త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ నాగ్‌పూర్ (ప్రధాన కార్యాలయం)లో ఎగరవేయలేదు," అని జైరామ్ రమేశ్ ఆరోపించారు.
కానీ 1966లో ఆర్ఎస్ఎస్పై మళ్లీ నిషేధం పడిందని కాంగ్రెస్ నేత గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్, జమాత్-ఈ- ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే, అది కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్‌కి వ్యతిరేకమని నాటి ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉన్నట్టు జైరామ్ రమేశ్ స్పష్టం చేశారు. ఈ నిషేధాన్ని జులై 9న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎత్తివేసిందని కాంగ్రెస్ నేత అన్నారు.
"జూన్ 4న విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తర్వాత ఆర్ఎస్ఎస్- ప్రధాని మధ్య బంధం మరింత బలహీనపడింది. ఇప్పుడు జులై 9న, 58ఏళ్ల పాటు ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిషేధం వాజ్‌పేయీ హయాంలో కూడా కొనసాగింది," అని జైరామ్ రమేశ్ చెప్పుకొచ్చారు.
"నాకు తెలిసి.. దౌత్యవేత్తలు ఇక నుంచి నిక్కర్ల (ఆర్ఎస్ఎస్ కార్యకర్తల దుస్తులు)లో కూడా రావొచ్చు," అని కాంగ్రెస్ నేత వ్యంగ్యాస్త్రం సంధించారు.
జులై 9 నాటి ఉత్తర్వులను బీజేపీ ఐటీ డిపార్ట్మెంట్ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు వెల్లడించారు.
"58ఏళ్ల క్రితం, 1966లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఇది అసలు జరిగి ఉండకూడదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీనిని మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిని నేను స్వాగతిస్తున్నాను," అని అమిత్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం