భారతదేశ జనాభాను లెక్కించే ప్రక్రియ 2027 మార్చి 1వ తేదీన ప్రారంభంవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు బుధవారం తెలిపారు. తదుపరి జనగణనతో పాటు కుల గణన కూడా ఉంటుంది. ఈ జనగణన కార్యక్రమం 2027 మార్చి 1 నుండి ప్రారంభమవుతుందని, అయితే లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు ప్రభావిత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియ 2026 అక్టోబరులో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. జనాభా గణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు.
భారతదేశంలో చివరి జనాభా గణన 2011 లో జరిగింది. సాధారణంగా భారత్ లో ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కిస్తారు. 2011 వరకు 15 సార్లు భారత్ లో జనగణ నిర్వహించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2021 లో జరగాల్సిన దేశవ్యాప్త జనాభా గణన ఆలస్యమైంది. 2027 జనగణనలో కులాల వారీ జనాభాను కూడా లెక్కించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏప్రిల్ 30 న నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల్లో కుల గణనను కూడా చేర్చాలని కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
సమర్థవంతమైన విధాన రూపకల్పనకు జనాభా గణన, సామాజిక ఆర్థిక గణాంకాలను ఖచ్చితమైన, తాజా లెక్కలతో రూపొందించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి వాదిస్తోంది. రాబోయే జనాభా లెక్కలతో పాటు కుల గణన నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఏప్రిల్ 30 న ప్రకటించిన వెంటనే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశంలో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలనే తన డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి మన దేశ పురోగతికి, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీల పురోగతికి అడ్డంకిగా మారుతోందని, ఈ అవరోధాన్ని తొలగించాలని తాము కోరుకుంటున్నామని రాహుల్ గాంధీ ఏప్రిల్ 30న అన్నారు.
కుల గణన అంటే జనాభా గణన సమయంలో కుల ఆధారిత డేటాను సేకరించడం. కుల సమూహాల పంపిణీ, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులు, విద్యా స్థితి, ఇతర సంబంధిత అంశాలపై డేటా వివరాలను అందిస్తుంది. సాధారణ జనాభా గణన ప్రక్రియలో కులం గురించి ప్రశ్నలను చేర్చడం కుల గణన వెనుక ఉన్న ఆలోచన. 1881 నుండి 1931 వరకు బ్రిటిష్ పాలనలో జనాభా గణనలో కుల గణన ఒక సాధారణ లక్షణంగా ఉండేది. అయితే, 1951 లో స్వతంత్ర భారతదేశంలో మొదటి జనగణనతో, ప్రభుత్వం ఈ పద్ధతిని నిలిపివేసింది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ప్రభుత్వం పౌరులను సామాజిక మరియు విద్యా ప్రమాణాల ఆధారంగా నాలుగు విస్తృత సమూహాలుగా వర్గీకరించింది. అవి షెడ్యూల్డ్ తెగలు (ST), షెడ్యూల్డ్ కులాలు (SC), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), మరియు జనరల్ కేటగిరీ. కానీ భారతదేశంలో 1951 నుండి జనాభా గణనల సమయంలో సేకరించిన డేటాలో హిందువులు. ముస్లింలు వంటి మత వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల వివరాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర కుల సంఘాల జనాభాను లెక్కించలేదు. అయితే, 1961 నాటికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు తమ స్వంత సర్వేలను నిర్వహించడానికి మరియు వారు కోరుకుంటే ఒబిసిల రాష్ట్రాల నిర్దిష్ట జాబితాలను సంకలనం చేయడానికి అనుమతించింది.
అందుబాటులో ఉన్న చివరి కులాల డేటా స్వాతంత్య్రానికి ముందు తీసుకున్న 1931 జనాభా లెక్కల నుండి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తీసుకున్న 1941 జనాభా గణన కూడా కులంపై డేటాను సేకరించింది. కానీ అది ఎప్పుడూ విడుదల కాలేదు. ఏప్రిల్ 30 నిర్ణయానికి ముందు బీజేపీ కుల గణనకు విముఖత చూపింది. వాస్తవానికి, సమాజాన్ని విభజించడానికి కాంగ్రెస్ కులాన్ని ఉపయోగిస్తోందని చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్ ను విమర్శించారు.
సంబంధిత కథనం