CBSE 2025: సీబీఎస్ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు అలర్ట్; సిలబస్ మారిందా?
CBSE 2025: 2024- 25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి, 12వ తరగతి సిలబస్ లో సీబీఎస్ఈ కీలక మార్పులు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత?
Alert CBSE class 10th and 12th students: 10వ తరగతి, 12వ తరగతి బోర్డు సిలబస్‌ను అన్ని సబ్జెక్టులలో 10 నుండి 15 శాతం వరకు తగ్గిస్తున్నట్లు సీబీఎస్ఈ (CBSE) ప్రకటించిందని వార్తలు వచ్చాయి. ఈ మార్పు విద్యార్థులపై అకడమిక్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు, సబ్జెక్టులపై వారికి లోతైన అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా ఉన్నట్టు ఊహాగానాలు జోరుగా సాగాయి. కానీ వీటిల్లో నిజం లేదని తేలింది. ఇది ఫేక్ న్యూస్ అని సీబీఎస్ఈ స్వయంగా ప్రకటించింది.
ఇంటర్నల్స్ ఎసెస్మెంట్ వెయిటేజీ పెంపు
2024- 2025 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ అసెస్‌మెంట్స్ ఎగ్జామ్ వెయిటేజీని సీబీఎస్ఈ పెంచింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ల వెయిటేజీ ఇప్పుడు ఫైనల్ గ్రేడ్‌లో 40 శాతం ఉంటుంది. మిగిలిన 60 శాతం సంప్రదాయ రాత పరీక్షల ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ చర్య విద్యార్థులు నిరంతరం అభ్యాసం చేయడాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు వారి విద్యా సంవత్సరంలో వారి పురోగతిని ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాలను అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని సీబీఎస్ఈ తీసుకుంది. అంతర్గత మదింపులపై పెరిగిన వెయిటేజీలో ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, రెగ్యులర్ గా జరిగే పీరియాడిక్ టెస్ట్ లు ఉంటాయి.
నూతన విద్యా విధానం 2020 కి అనుగుణంగా..
నూతన విద్యా విధానం 2020 (NEP 2020) కి అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి బోర్డు తన పరీక్షా విధానాన్ని కూడా సవరిస్తోంది. 2025 బోర్డు పరీక్షలో 50 శాతం ప్రశ్నలు సైద్ధాంతిక పరిజ్ఞానం కంటే నిజ జీవిత అనువర్తనాలపై ఆధారపడి ఉంటాయి. ఈ మార్పు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కు పరిష్కారం కనుగొనే నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డిజిటల్ అసెస్‌మెంట్ ఫార్మాట్
పారదర్శకత, మూల్యాంకన కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, బోర్డు కొన్ని విభాగాలలో జవాబు పత్రాల కోసం డిజిటల్ మూల్యాంకన విధానాన్ని ఉపయోగిస్తుంది. ఇది వ్యాల్యుయేషన్ లో తరచుగా జరిగే పొరపాట్లు, తప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, మూల్యాంకన విధానాన్ని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా చేస్తుంది.
కొన్ని సబ్జెక్టుల కోసం బుక్ ఎగ్జామ్ ఫార్మాట్
అదనంగా, సాంఘిక శాస్త్రం, ఆంగ్ల సాహిత్యం వంటి కొన్ని విభాగాల కోసం, సీబీఎస్ఈ ఓపెన్-బుక్ ఎగ్జామ్ మోడల్ ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానం ద్వారా విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి కన్నా గ్రహణశక్తి, విశ్లేషణాత్మక సామర్థ్యాలను మెరుగ్గా పరీక్షించవచ్చని సీబీఎస్ఈ (CBSE) భావిస్తోంది. వాస్తవాలను గుర్తుంచుకోవడానికి బదులు జ్ఞానాన్ని విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి, సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి విద్యార్థుల సామర్థ్యాలను మూల్యాంకనం చేయడం, వాటిని లోతైన స్థాయిలో కంటెంట్‌తో నిమగ్నమయ్యేలా చేయడం ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్ మోడల్ లక్ష్యం.
వచ్చే ఏడాది నుంచి రెండు పర్యాయాల బోర్డు ఎగ్జామ్స్
2024- 2025 విద్యా సంవత్సరానికి, బోర్డు 10వ, 12వ తరగతి రెండు తరగతులకు సింగిల్ టర్మ్ నమూనాలో పరీక్షలను నిర్వహిస్తుంది. కానీ, 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు పర్యాయాలు బోర్డ్ పరీక్షలు ఉంటాయని సీబీఎస్ఈ (cbse) ప్రాంతీయ అధికారి, వికాస్ అగర్వాల్ వెల్లడించారు.