ఆర్‌జీ కర్ ఆసుపత్రి హత్యాచారం కేసులో సంజయ్‌ రాయ్‌ని ఉరితీయాలని హైకోర్టులో సీబీఐ, మమతా ప్రభుత్వం పిటిషన్లు-cbi and mamata govt petitions calcutta high court seeking death penalty for sanjya roy in rg kar rape case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆర్‌జీ కర్ ఆసుపత్రి హత్యాచారం కేసులో సంజయ్‌ రాయ్‌ని ఉరితీయాలని హైకోర్టులో సీబీఐ, మమతా ప్రభుత్వం పిటిషన్లు

ఆర్‌జీ కర్ ఆసుపత్రి హత్యాచారం కేసులో సంజయ్‌ రాయ్‌ని ఉరితీయాలని హైకోర్టులో సీబీఐ, మమతా ప్రభుత్వం పిటిషన్లు

Anand Sai HT Telugu
Jan 23, 2025 06:03 AM IST

Kolkata Rape and Murder Case : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో హత్యాచారం కేసుకు సంబంధించి సీబీఐ, మమతా బెనర్జీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లాయి. దోషి సంజయ్‌ రాయ్‌ని ఉరితీయాలని పిటిషన్లు దాఖలు చేశాయి.

సంజయ్‌ రాయ్‌
సంజయ్‌ రాయ్‌ (Hindustan Times)

ఆర్జీ కర్ ఆసుపత్రి హత్యాచారం కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ విషయంలో హైకోర్టులో కొత్త విషయం మెుదలైంది. షిల్దా కోర్టు సంజయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పశ్చిమబెంగాల్‌లోని మమతా ప్రభుత్వం, సీబీఐ అతడిని ఉరితీయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. 

yearly horoscope entry point

కోర్టులో మమతా ప్రభుత్వం పిటిషన్

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేరాన్ని అత్యంత అరుదైన నేరంగా అభివర్ణించిన మమతా బెనర్జీ దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దీనిపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించగా, బుధవారం సీబీఐ కూడా సంజయ్ రాయ్‌ను ఉరితీయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.

బాధితురాలికి న్యాయం జరగాలని

ఆనంద బజార్ పత్రిక కథనం ప్రకారం.. సీబీఐ తన పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను ప్రశ్నించింది. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ రాజ్దీప్ మజుందార్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసినప్పుడు బాధితురాలి కుటుంబం, సీబీఐ లేదా దోషి మాత్రమే హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. సీబీఐ అభ్యంతరాన్ని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది, అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్తా వ్యతిరేకించారు. బాధితురాలికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, దోషులను కఠినంగా శిక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

యావజ్జీవ శిక్ష వేసిన కోర్టు

గత శనివారం షిల్దా కోర్టు సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించి సోమవారం న్యాయమూర్తి అనిర్బన్ దాస్ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ తీర్పుపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదని, హైకోర్టులో మరణశిక్షను కోరతానని చెప్పారు.

ఉరిశిక్షగా మారుస్తారా?

మరోవైపు దిల్లీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ దేశాలు వచ్చిన తర్వాతే సీబీఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. దోషికి మరణశిక్ష విధించాలని సీబీఐ కోరుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ కోర్టుకు వెళ్లడంతో ఈ కేసు ఆసక్తిగా మారింది. ఇరు పక్షాల వాదనలు ఇప్పుడు కోర్టు ముందు జరగనున్నాయి. అక్కడ సంజయ్ రాయ్‌కి విధించిన శిక్షను మరణశిక్షగా మారుస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.