women night shift: ‘‘మహిళలు నైట్ షిఫ్ట్ లు చేయొద్దని ఎలా చెబుతారు?’’: సుప్రీంకోర్టు ఆగ్రహం-cant restrict women sc slams bengal govts no night shift order ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women Night Shift: ‘‘మహిళలు నైట్ షిఫ్ట్ లు చేయొద్దని ఎలా చెబుతారు?’’: సుప్రీంకోర్టు ఆగ్రహం

women night shift: ‘‘మహిళలు నైట్ షిఫ్ట్ లు చేయొద్దని ఎలా చెబుతారు?’’: సుప్రీంకోర్టు ఆగ్రహం

Sudarshan V HT Telugu
Sep 17, 2024 07:48 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మహిళలకు నైట్ షిఫ్ట్ డ్యూటీలు వేయవద్దని ఆదేశిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme Court of India: భారత సర్వోన్నత న్యాయస్థానం
Supreme Court of India: భారత సర్వోన్నత న్యాయస్థానం (HT_PRINT)

మహిళా వైద్యులను నైట్ షిఫ్టులో నియమించరాదని ఆదేశిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నోటిఫికేషన్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించింది.

మహిళలపై ఆంక్షలు ఎందుకు?

ఆగస్టు 9న కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పీజీ చదువుతున్న ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసును సుమోటోగా విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మహిళా వైద్యులను ఎందుకు పరిమితం చేయాలనుకుంటున్నారని బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రశ్నించారు. మహిళలు రాత్రిపూట పని చేయలేరని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మహిళా వైద్యులను ఎందుకు పరిమితం చేయాలి? వారికి మీ రాయితీలేం వద్దు... మహిళలు అదే షిఫ్ట్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు" అని ఆయన తేల్చి చెప్పారు.

సెక్యూరిటీ కల్పించండి..

మహిళా వైద్యులకు నైట్ షిఫ్ట్ డ్యూటీలు వేయకుండా నిరోధించడం కాకుండా, వారికి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (supreme court) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మహిళా వైద్యులకు నైట్ డ్యూటీలు వేయకుండా ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవరించాలని ఆయన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘‘భద్రత కల్పించడం మీ బాధ్యత. రాత్రిపూట మహిళలు పనిచేయడాన్ని మీరు నిరోధించలేరు. పైలట్లు, ఆర్మీ సిబ్బంది, ఇతరులు రాత్రిపూట పనిచేస్తారు’’ అని వ్యాఖ్యానించింది. బాధితురాలి పేరును తన ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వికీపీడియాను కోరింది.

కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరిగింది?

కోల్ కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో నైట్ డ్యూటీకి వెళ్లిన ట్రైనీ డాక్టర్, ఆసుపత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. ఆగస్టు 9వ తేదీ ఉదయం ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి, హత్య చేశారు. ఈ నేరానికి సంబంధించి సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ వేలాది మంది జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

మమతా బెనర్జీతో డాక్టర్ల సమావేశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నిరసన తెలుపుతున్న వైద్యుల మధ్య సోమవారం ఒక ఒప్పందం కుదిరింది. పోలీసుల కమిషన్, డీసీపీ, ఇద్దరు సీనియర్ హెల్త్ ఆఫీసర్లను తొలగించాలన్న వైద్యుల ప్రధాన డిమాండ్ ను ఆమె అంగీకరించారు. అయితే ఆరోగ్య శాఖ కార్యదర్శిని తొలగించడానికి ఆమె అంగీకరించలేదు. విధులకు తిరిగి వచ్చే వారిపై ఎలాంటి శిక్ష లేదా ప్రతికూల చర్యలు తీసుకోబోమని మమతా బెనర్జీ (mamata banerjee) వైద్యులకు హామీ ఇచ్చారని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.