మధ్యప్రదేశ్లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పలు మీడియా కథనాల ప్రకారం.. 49ఏళ్ల ఆ వ్యక్తికి ఒక మెడికల్ స్టోర్ ఉంది. కాగా ఇంట్లోని ఆయన రూమ్లో నుంచి తుపాకీ శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. అప్పటికే ఆయన శవమై కనిపించాడు.
మృతుడి కుమార్తె 15 రోజుల క్రితం వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ కృష్ణ లాల్ చందానీ తెలిపారు.
అనంతరం ఆమెను ఇండోర్లో గుర్తించి తీసుకొచ్చారు. కోర్టు విచారణ సందర్భంగా తాను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నానని, భర్తతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. మనస్తాపానికి గురైన ఆ మహిళ తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు.
మెడికల్ స్టోర్ యజమాని తన కుమార్తె ఆధార్ కార్డు ప్రింటౌట్పై నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవాలన్న ఆమె నిర్ణయంపై ఆయన భావోద్వేగానికి లోనైనట్లు పోలీసులు తెలిపారు.
ఆ నోట్లో 'మీరు తప్పు చేశారు, నేను వెళ్లిపోతున్నాను. మీ ఇద్దరినీ నేను చంపగలిగాను, కానీ నా కూతురిని ఎలా చంపగలను?" అని రాసి ఉంది.
“నువ్వు చేసింది కరెక్ట్ కాదు. డబ్బు కోసం కుటుంబం మొత్తాన్ని త్యాగం చేసే లాయర్కి కూతుళ్లు లేరా? తండ్రి బాధ ఆయనకు అర్థం కాలేదా? ఒక కుటుంబం మొత్తం నాశనమైంది. ఇప్పుడు సమాజంలో ఏమీ మిగలలేదు,” అని నోట్లో ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో మృతుడు మరణానికి ముందు పూర్తి లీగల్ వ్యవస్థను ప్రశ్నించాడు. ఆర్య సమాజ్లో జరిగిన పెళ్లి చెల్లుబాటు కాకపోతే, మరి కూతురు వేరే వ్యక్తితో వెళ్లిపోవడాన్ని కోర్టు ఎలా సమర్థిస్తుంది? అని ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, మెడికల్ స్టోర్ ఓనర్ బంధువులు, అతని కూతురు వివాహం చేసుకున్న వ్యక్తి తండ్రిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి తండ్రిని ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లి అపస్మారక స్థితికి చేరుకునే వరకు కొట్టారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. అది గమనించిన స్థానికులు జోక్యం చేసుకుని క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య, తదనంతర దాడిపై దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత కథనం