Justin Trudeau : 'ఖలిస్థానీ ఉగ్రవాది హత్యలో భారత్ హస్తం'- కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు!
Justin Trudeau : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య నేపథ్యంలో భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. అతని హత్య వెనుక భారత్ హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేశారు.
Justin Trudeau latest news : భారత ప్రభుత్వంపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది, టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై.. కెనడాలో భారత్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తను అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. ఫలితంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న భారత్- కెనడా బంధం మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.
నిజంగా భారత్ హస్తం ఉందా..?
పంజాబ్ జలంధర్‌లోని భార్సింఘ్పూర్లో జన్మించాడు నిజ్జార్. అతడిని ఎన్ఏఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ).. పరారీలో ఉన్న నిందితుడిగా గుర్తించింది. గతేడాది జులైలో నిజ్జార్‌పై రూ. 10లక్షల క్యాష్ రివార్డ్‌ను కూడా ప్రకటించింది.
కాగా.. కెనడా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారాలో జూన్ 18న కొందరు దుండగులు.. హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను చంపేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ విషయంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు జస్టిన్ ట్రూడో.
India Canada relations "ఈ విషయంపై కొంత కాలంగా దర్యాప్తు చేస్తున్నాము. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందనేందుకు.. కెనడా భద్రతా దళాల వద్ద బలమైన ఆధారాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇతర దేశాలు మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ విషయంపై మా మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నాము. ఇది చాలా తీవ్రమైన అంశం. మేము చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నాము," అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.
ఈ విషయంపై తమకు సహకరించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ట్రూడో. ఈ పరిస్థితులతో ఇండో- కెనడియన్లు భయపడాల్సి అవసరం లేదని, ఎప్పటిలాగే అందరు కలిసి మెలిసి ఉండొచ్చని హామీనిచ్చారు ట్రూడో.
భారత దౌత్యవేత్త బహిష్కరణ..
Hardeep Singh Nijjar : భారత ప్రభుత్వంపై జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేసిన కొంతసేపటికి.. ఒటావాలోని భారత ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బహిష్కరించింది కెనడా.
"కెనడాలోని భారతీయ సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నాము," అని ఆ దేశ విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) చీఫ్ అని పేర్కొంది.
ప్రతిఘటించిన భారత్..
జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. వాటిల్లో నిజం లేదని తేల్చిచెప్పింది. ఇండియాలోని కెనడా హైకమిషనర్‌ను పిలిపించింది. అనంతరం.. భారత్‌లో ఉన్న కెనడాకు చెందిన సీనియర్ దౌత్యాధికారిని దేశం నుంచి బహిష్కరించింది.
బలహీనపడుతున్న బంధం..!
Canada expels Indian diplomat : ఖలిస్థానీ ఉగ్రవాదం అంశంలో భారత్- కెనడా బంధం రోజురోజుకు బలహీనపడుతూ వస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాద సమస్యను కెనడా పరిష్కరించట్లేదని భారత్ అంసతృప్తిగా ఉంది. జీ20 సదస్సులో భాగంగా.. భారత ప్రధాని మోదీ- జస్టిన్ ట్రూడో మధ్య జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంపై మోదీ కాస్త గట్టిగానే మాట్లాడినట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్