అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇకపై దీపావళి పండుగను అధికారిక రాష్ట్ర సెలవుదినంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ బిల్లుపై సంతకం చేశారు. ఈ నిర్ణయం 2026 జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
దీంతో, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడవ US రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. గతంలో పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు ఈ పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చాయి. వెస్ట్ కోస్ట్‌లో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియా కావడం విశేషం.
గవర్నర్ న్యూసమ్ సంతకం చేసిన ఈ కొత్త చట్టం (Assembly Bill 268) వల్ల.. దీపావళి రోజున ప్రజలకు ఎంతో సౌలభ్యం కలగనుంది. పబ్లిక్ స్కూళ్లు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి రోజున మూసివేయడానికి ఈ చట్టం అధికారం ఇస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, పబ్లిక్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు పండుగను జరుపుకోవడానికి సెలవు లభిస్తుంది.
హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ కల్రా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. "విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా సెలవు తీసుకోవడం, రాష్ట్ర ఉద్యోగులు వేతనంతో కూడిన సెలవు తీసుకోవడం... ఈ నిబంధనలు దీపావళిని జరుపుకునే వారికి నిజంగా సులభతరం చేసే ముఖ్యమైన ముందడుగు" అని ఆయన తెలిపారు.
కాలిఫోర్నియాలో లక్షలాది మంది భారతీయ-అమెరికన్లు నివసిస్తున్నారు. 2025 ప్యూ సర్వే ప్రకారం, దేశంలో ఉన్న 4.9 మిలియన్ల భారతీయ జనాభాలో, దాదాపు 9,60,000 మంది (20%) కాలిఫోర్నియాలోనే ఉన్నారు. ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలోని శాన్ జోస్ వంటి నగరాల్లో భారతీయ అమెరికన్ల జనాభా గణనీయంగా ఉంది.
ఈ చట్టం తీసుకురావడం ద్వారా కాలిఫోర్నియా ప్రభుత్వం తన బహుళ సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించినట్లు అయింది. ఈ బిల్లును అసెంబ్లీ సభ్యులు ఆష్ కల్రా (శాన్ జోస్), దర్శన పటేల్ (శాన్ డియాగో) కలిసి ప్రవేశపెట్టారు.
"దక్షిణాసియా పిల్లలు ఈ పండుగను గర్వంగా జరుపుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి ఇది ఒక చారిత్రక ఘట్టం" అని ఆష్ కల్రా వ్యాఖ్యానించారు.
దీపావళిని 'వెలుగుల పండుగ' అని పిలుస్తారు. ఇది కేవలం హిందూ పండుగగా మాత్రమే కాకుండా, అనేక ఇతర మతాల వారికి కూడా ముఖ్యమైనది. ఈ కొత్త చట్టం హిందువులతో పాటు సిక్కులు, జైనులు, బౌద్ధులకు కూడా దీపావళి ప్రాముఖ్యతను గుర్తించింది.
సిక్కుల సంకీర్ణానికి చెందిన పునీత్ కౌర్ సంధు మాట్లాడుతూ, "మా సంస్థ ఆష్ కల్రాతో కలిసి పనిచేసింది. దీపావళి రోజున ఇతర మతస్తులు జరుపుకునే పండుగలు కూడా ఇందులో చేర్చబడేలా చూసుకున్నాం. ఈ రోజును సమాజంలోని అందరూ జరుపుకోగలగడం చాలా అర్థవంతంగా ఉంటుంది" అని చెప్పారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని సౌత్ ఏషియన్ నెట్‌వర్క్ బోర్డు ఛైర్ రోహిత్ షెన్రీకర్ మాట్లాడుతూ, "ఈ చట్టం కాలిఫోర్నియాలోని దక్షిణాసియా సమాజాన్ని మాత్రమే కాక, ఈ రాష్ట్రంపై వారు చూపిన ప్రభావాన్ని కూడా గుర్తిస్తుంది. 1960ల్లో నా తల్లిదండ్రుల వలస అనుభవాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పిల్లలు, వారి స్నేహితులతో కలిసి మా సంస్కృతిని పంచుకునే అవకాశం దొరికింది. ఇది కాలిఫోర్నియా ప్రజల మధ్య బలమైన బంధాన్ని పెంచుతుంది" అని అభిప్రాయపడ్డారు.