ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో రూ.3,985 కోట్ల పెట్టుబడితో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతరిక్ష మౌలిక సదుపాయాల్లో దేశానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. మొదటి, రెండో లాంచ్ ప్యాడ్లను పరిశీలిస్తే, ఈ రెండింటి కంటే ఇది చాలా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇస్రో తన స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ (స్పాడెక్స్)లో భాగంగా ఉపగ్రహాల డాకింగ్ ను విజయవంతంగా నిర్వహించింది. డాకింగ్ తరువాత రెండు ఉపగ్రహాలను నియంత్రించడం విజయవంతమైందని సంస్థ ధృవీకరించింది. ‘‘అంతరిక్ష చరిత్రలో భారత్ పేరు మార్మోగిపోయింది. గుడ్ మార్నింగ్ ఇండియా ఇస్రో స్పాడెక్స్ మిషన్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ క్షణాన్ని చూసినందుకు గర్వంగా ఉంది’’ అని ఎక్స్ లో ఇస్రో తెలిపింది. దీంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత శాటిలైట్ డాకింగ్ ను విజయవంతంగా నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమనౌకలను ఉపయోగించి స్పేస్ డాకింగ్ ను పూర్తి చేసింది. అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతిక ప్రదర్శన స్పాడెక్స్ మిషన్ అని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలో భాగస్వామ్య లక్ష్యాలను సాధించడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమయ్యే మిషన్లకు డాకింగ్ టెక్నాలజీ కీలకం. అంతకు ముందు జనవరి 12న ఇస్రో రెండు వ్యోమనౌకలను ఒకదానికొకటి మూడు మీటర్ల దూరంలోకి తీసుకువచ్చి సురక్షిత దూరానికి తరలించే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇస్రో 2024 డిసెంబర్ 30న స్పాడెక్స్ మిషన్ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 24 పేలోడ్లతో ఎస్డీఎక్స్01 (ఛేజర్), ఎస్డీఎక్స్ 02 (టార్గెట్) అనే రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నింగిలోకి దూసుకెళ్లిన 15 నిమిషాల తర్వాత 220 కిలోల బరువున్న రెండు వ్యోమనౌకలను ప్రణాళిక ప్రకారం 475 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు.