Bus accident : తీవ్ర విషాదం- లోయలో పడిన బస్సు.. 23మంది దుర్మరణం!
ఉత్తరాఖండ్లో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో బస్సులో కనీసం 40 మంది ఉన్నట్టు సమాచారం.
ఉత్తరాఖండ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పౌరీ-అల్మోరా సరిహద్దులో ఉన్న రాంనగర్లోని కుపి సమీపంలో గర్వాల్ మోటార్స్ యూజర్స్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి గాలింపు చర్యలు చేపట్టారు.
బస్సు ప్రమాదానికి కారణం ఏంటి?
బస్సు గర్వాల్ నుంచి కుమావున్ వెళ్తుండగా అల్మోరాలోని మర్కులా వద్ద ఈ ప్రమాదం జరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ పాండే తెలిపారు.
ప్రమాదం సమయంలో బస్సులో కనీసం 40మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 23మంది మృతదేహాలు లభించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు స్థానిక యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి.
బస్సు లోయలో పడిన ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“అల్మోరా జిల్లా మర్చులాలో జరిగిన దురదృష్టకరమైన బస్సు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని చాలా బాధాకరమైన వార్త వచ్చింది. సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాను,” అని ఆయన తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను అవసరమైతే విమానంలో తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఆ ప్రాంతంలోని ఆర్టీఓ అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 1 లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. మెజిస్టీరియల్ విచారణకు కూడా ఆదేశించారు.
సంబంధిత కథనం