'నాన్న మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేయాలి'.. తండ్రి అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల గొడవ
Madhya Pradesh News : మధ్యప్రదేశ్‌లో తండ్రి అంత్యక్రియలపై సోదరుల మధ్య దారుణంగా గొడవ జరిగింది. తండ్రి శవాన్ని రెండు ముక్కలుగా చేయాలని పెద్ద కుమారుడు చెప్పాడు.
రోజురోజుకు మానవతా విలువలు తగ్గిపోతున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచిన తండ్రి చనిపోయారు. అతడి అంత్యక్రియల విషయంలో సోదరుల మధ్య గొడవ జరిగింది. మృతుడి పెద్ద కుమారుడు.. తండ్రి శవాన్ని రెండు ముక్కలుగా చేయాలని చెప్పాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని తికంఘర్ జిల్లాలో జతారా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిధౌర్ గ్రామంలో తండ్రి అంత్యక్రియల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. తండ్రి అంత్యక్రియలకు సంబంధించి ఇద్దరు సోదరుల మధ్య వివాదం చెలరేగింది. చాలా గంటలపాటు గొడవ కొనసాగింది. వాగ్వాదం పెరిగి తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేయాలని పెద్ద కుమారుడు చెప్పాడు.
లిధౌరా తాల్‌కు చెందిన 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ నిన్న ఉదయం మరణించారు. ఆయన మరణానంతరం చిన్న కుమారుడు దామోదర్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ధ్యాని సింగ్ ఘోష్ మరణవార్త అందుకున్న గ్రామ ప్రజలు, బంధువులు అంత్యక్రియలకు చేరుకున్నారు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగా దామోదర్ సోదరుడు కిషన్ సింగ్ ఘోష్ కూడా కుటుంబంతో అక్కడికి చేరుకున్నాడు. కిషన్ సింగ్ వచ్చిన వెంటనే తండ్రి అంత్యక్రియలు తానే నిర్వహిస్తానని పట్టుబట్టాడు. దామోదర్ మాత్రం అంత్యక్రియలను అన్న నిర్వహించడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ఇద్దరు సోదరుల మధ్య అంత్యక్రియల గురించి గొడవ ప్రారంభమైంది.
తండ్రి తనతో నివసించాడని, అందుకే అంత్యక్రియలు చేస్తానని చిన్న కుమారుడు దామోదర్ చెప్పాడు. ఈ విషయమై ఇద్దరు కుమారుల మధ్య గంటల తరబడి వాగ్వాదం జరిగింది. తండ్రి మృతదేహాన్ని కూడా ఇంటి బయటే ఉంచారు. ఈ సమయంలో గ్రామ ప్రజలు, బంధువులు సోదరులిద్దరికీ చాలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు.
అయితే అన్నయ్య కిషన్ ఇందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేయాలని కిషన్ చెప్పాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. చివరకు విషయం పోలీసులకు తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకుని సోదరులిద్దరినీ ఒప్పించి అంత్యక్రియలు జరిగేలా చేశారు పోలీసులు.