Blast in Afghanistan kills 16: భారీ పేలుడులో 16 మంది దుర్మరణం
అఫ్గానిస్తాన్ లో బుధవారం జరిగిన భారీ పేలుడులో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఈ పేలుడు సంభవించింది.
Blast in Afghanistan అఫ్గానిస్తాన్ లో బుధవారం చోటు చేసుకున్న భారీ పేలుడులో 16 మంది చనిపోయారు. వారిలో అత్యధికులు విద్యార్థులే. అఫ్గానిస్తాన్ లోని సమాంగన్ రాష్ట్రంలో ఉన్నఐబక్ పట్టణంలో ఈ పేలుడు చోటు చేసుకుంది.
Blast in Afghanistan మదరసాలో..
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ కు ఉత్తరంగా 200 కిమీల దూరంలో ఉన్న ఐబక్ పట్టణంలో ఉన్న అల్ జిహాద్ మదరసాలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి స్కూల్ భవనం ధ్వంసమైంది. పేలుడు కారణంగా 16 మంది చనిపోయారు. సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 10 మందికి పైగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే ఉన్నారు. ఈ పేలుడుకు బాధ్యత తీసుకుంటున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, అఫ్గానిస్తాన్లో సాధారణ పౌరులు లక్ష్యంగా ఇటీవల జరిగిన పలు బాంబు దాడుల సమయంలో, ఆ దాడులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో, ఈ దాడి కూడా ఐఎస్ పనేనని భావిస్తున్నారు.
Blast in Afghanistan దోషులను కఠినంగా శిక్షిస్తాం
అఫ్గానిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్ ఈ దాడిని ధ్రువీకరించింది. బాంబు దాడిలో 10 మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొంది. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని సాధ్యమైనంత త్వరగా కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. ఈ బాంబు దాడి అనంతరం మదరసాలోని భీతావహ దృశ్యాలున్న వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. ఐబక్ పట్టణం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. గతంలో బుద్ధిస్ట్ కేంద్రంగా విరాజిల్లింది. ఉత్తర దిశ నుంచి కాబూల్ కు వచ్చే వ్యాపారస్తులు అక్కడే తొలి విడిది చేసేవారు.