ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్‌కు డ్యామేజ్.. డేటా విశ్లేషించేందుకు విదేశాలకు!-black box damaged in air india plane crash at ahmedabad may sent to abroad for investigation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్‌కు డ్యామేజ్.. డేటా విశ్లేషించేందుకు విదేశాలకు!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్‌కు డ్యామేజ్.. డేటా విశ్లేషించేందుకు విదేశాలకు!

Anand Sai HT Telugu

జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ దెబ్బతిందని తెలుస్తోంది. డేటాను విశ్లేషించేందుకు దీనిని విదేశాలకు పంపాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం

దేశాన్ని మొత్తం దుఃఖంలో ముంచెత్తిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి వారం రోజులు అవుతుంది. విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. ప్రమాద స్థలం నుండి స్వాధీనం చేసుకున్న బ్లాక్ బాక్స్‌ను పరీక్ష కోసం అమెరికాకు పంపాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బ్లాక్ బాక్స్ తీవ్రంగా దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం అమెరికాలో దాని సీవీఆర్, ఎఫ్‌డీఆర్‌లను పరిశీలించాలని నిర్ణయించే అవకాశం ఉంది.

బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు పరికరాలను కలిగి ఉంటుంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్‌డీఆర్). కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం నుండి స్వాధీనం చేసుకున్న 'బ్లాక్ బాక్స్'ను పరీక్ష కోసం వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డుకు పంపే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్‌ను అమెరికాకు పంపితే అన్ని ప్రోటోకాల్‌లు పాటించడానికి సిద్ధంగా ఉండాలి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి.

ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్‌లు నారింజ రంగులో మెరిసేలా ఉంటాయి. ఇది శిథిలాలు గుర్తించడంలో సహాయపడుతుంది. ప్రమాద సమయంలో బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిన్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో దానిని అమెరికాకు పంపాల్సి వస్తుంది. భారత్‌కు చెందిన అధికారుల బృందం కూడా బ్లాక్ బాక్స్‌తోపాటు అమెరికా వెళ్లనుందని చెబుతున్నారు.

అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. మధ్యాహ్నం 1:40 గంటలకు మేఘని నగర్ ప్రాంతంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ కాంప్లెక్స్‌పైకి విమానం దూసుకెళ్లింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ఈ ప్రమాదంలో మరణించారు. భవనంలో ఉన్నవారు కూడా మృతి చెందడంతో 270 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.