Maharashtra politics: బీజేపీదే సర్కార్.. మూడోసారి ముఖ్యమంత్రిగా ఫడణవీస్
Maharshtra News: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ మూడోసారి బాధ్యతలు చేపట్టబోయేందుకు రంగం సిద్ధమైంది.
ముంబై, జూన్ 30: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడనుంది. బీజేపీ నేతృత్వంలోని సర్కారు కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. సభలో విశ్వాస పరీక్ష నిర్వహణపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామా చేశారు.

288 సభ్యుల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 106 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ కోరనుంది.
ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ మూడోసారి ముఖ్యమంత్రి పదవి దక్కించుకోనున్నారు. ఆయన ఇప్పటికే రెండుసార్లు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. ఈరోజు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
థాకరే నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రి పదవికి, శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ ప్రకటనతో రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చినట్టయ్యింది. దాదాపు వారం రోజులకు పైగా శివసేనలోని అసమ్మతి వర్గం ఉద్దవ్ థాకరేపై రాజకీయంగా దాడి చేస్తూ వచ్చింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శిస్తూ వచ్చింది.
మరోవైపు ఏక్‌నాథ్ షిండే వర్గం సంబరాల్లో మునిగి తేలుతోంది. తొలుత సూరత్‌లో క్యాంపు నడిపిన ఆ వర్గం అక్కడి నుంచి గువాహటికి చేరుకుని చాలా రోజులు క్యాంప్ నడిపింది. అక్కడి నుంచి బయలుదేరి బుధవారం అర్ధరాత్రి గోవా చేరుకుంది.
శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ పలుసార్లు సమావేశమవనుంది.
39 మంది శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలు, పలువురు ఇండిపెండెంట్ శాసన సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, అందుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను బీజేపీ కలవనుంది.
బుధవారం రాత్రే పలువురు ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేశారు.
ముంబైలోనే ఉండాలని బీజేపీ తన ఎమ్మెల్యేలకు సూచించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ ఫడణవీస్, ఏక్‌నాథ్ షిండే కలిసి తదుపరి కార్యాచరణను రూపొందిస్తారని స్పష్టం చేశారు.
దేవేంద్ర ఫడణవీస్ 2014గా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తిరిగి 2019లో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
విశ్వాస పరీక్ష నిర్వహణపై స్టే ఇవ్వాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి మూడున్నర గంటలపాటు విచారణ జరిపింది. రాత్రి 9 గంటలకు ఉత్తర్వులు వెలువరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. నేటి విశ్వాస పరీక్ష జూలై 11 నాటి విచారణకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
సంబంధిత కథనం