Uttarakhand: ముస్లిం యువకుడితో కూతురి పెళ్లిని రద్దు చేసిన బీజేపీ నాయకుడు.. సోషల్ మీడియాలో విమర్శలతో..
BJP Leader cancels daughters marriage: ముస్లిం యువకుడితో తన కూమార్తె వివాహాన్ని ఓ బీజేపీ నేత రద్దు చేశారు. ప్రజల సెంటిమెంట్‍ను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
BJP Leader cancels daughters marriage: ముస్లిం యువకుడితో తన కూతురి వివాహాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) నేత యశ్‍పాల్ బెనమ్ (Yashpal Benam) రద్దు చేశారు. పరస్పర అంగీకారంతో ఇరు కుటుంబాల సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఉత్తరాఖండ్(Uttarakhand)లోని పౌరి గర్హ్వాల్‍కు చెందిన ఓ ముస్లిం యువకుడితో తన కూతురి వివాహం చేయాలని ఉత్తరాఖండ్‍కు చెందిన బీజేపీ నాయకుడు యశ్‍పాల్ బెనమ్ ఇటీవల నిర్ణయించారు. వివాహ ఆహ్వాన పత్రికలు (Wedding Invitations) కూడా పంచారు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవటంతో వివాదం చెలరేగింది. దీంతో పెళ్లినే ఆయన నిలిపివేశారు. వివరాలివే..
ప్రజల సెంటిమెంట్‍ను గౌరవిస్తా
BJP Leader cancels daughters marriage: ఈనెల 28న ఈ పెళ్లి వేడుక జరగాల్సింది. “28వ తేదీన జరగాల్సిన పెళ్లి రద్దయింది. ప్రజాప్రతినిధిగా ఉన్న నేను నా కూతురి వివాహాన్ని పోలీసులు, అధికారుల రక్షణలో జరపాలని అనుకోవడం లేదు. ప్రజల సెంటిమెంట్లను నేను గౌరవిస్తా” అని బీజేపీ నేత యశ్‍పాల్ బెనమ్ ఆదివారం అన్నారు. ఇరు కుటుంబాల అంగీకారం మేరకు ముందుగా ఈ పెళ్లి నిర్ణయించామని, అయితే కొన్ని విషయాలు తెరవైకి రావటంతో విరమించుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
హిందువు అయిన బీజేపీ నేత యశ్‍పాల్ బెనమ్.. తన కుమార్తె విహారాన్ని ముస్లిం యువకుడితో చేస్తున్నారంటూ పెళ్లి ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ మద్దతుదారులు, వ్యతిరేకులు కామెంట్లు చేశారు. వివాహంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది లవ్ జిహాద్ కాదా అంటూ కొందరు కామెంట్లు చేశారు. వివాదం పెద్దదైంది. దీంతో కుమార్తె వివాహాన్ని విరమించుకునేందుకు యశ్‍పాల్ నిర్ణయించారు.
“పిల్లల భవిష్యత్తు, వారి సంతోషాన్ని దృష్టిలో ఉంచుకొని వారి వివాహం చేసేందుకు రెండు కుటుంబాలు నిర్ణయించాయి. కార్డ్స్ ప్రింట్ చేసి, షేర్ చేశాం. అయితే సోషల్ మీడియాలో ఇన్విటేషన్ కార్డు వైరల్ అవటం, వివాహంపై అభ్యంతాలు వ్యక్తం చేస్తూ చాలా రకాలైన విషయాలు ముందుకు వచ్చాయి. వివాదం పెరగటంతో, పరస్పర అంగీకారంతో రెండు కుటుంబాలు ప్రస్తుతం వివాహాన్ని నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాయి” అని యశ్‍పాల్ బెనమ్ వెల్లడించారు.
అయితే, అదే వ్యక్తితో భవిష్యత్తులో తమ కుమార్తె పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.