Video: ఇంగ్లిష్‍లో మాట్లాడిన రైతు.. అడ్డుకున్న సీఎం
Bihar CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సహనాన్ని కోల్పోయారు. ఓ రైతు ఎక్కువగా ఇంగ్లిష్ పదాలను వాడటంతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
Bihar CM Nitish Kumar: ప్రసంగంలో ఇంగ్లిష్ పదాలను ఎక్కువగా వినియోగించిన రైతును బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడ్డుకున్నారు. ఇంగ్లిష్ పదాలు ఎందుకు వాడుతున్నావంటూ ఆ రైతు ప్రసంగానికి అడ్డుతగిలారు. ఇంగ్లిష్‍లో మాట్లాడేందుకు ఇదేమైనా ఇంగ్లండ్ అనుకుంటున్నాావా అంటూ అసహనానికి గురయ్యారు. పట్నాలోని బాబా సభాగర్ ఆడిటోరియంలో ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇది జరిగింది. వ్యవసాయం కోసం నాలుగో రోడ్‍మ్యాప్ ఆవిష్కరణకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీంట్లోనే ఈ ఘటన జరిగింది.
Bihar CM Nitish Kumar: లఖీసరాయ్ (Lakhisarai) జిల్లాకు చెందిన అమిత్ కుమార్ అనే రైతు ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు నిలబడ్డారు. మేనేజ్‍మెంట్ గ్రాడ్యుయేషన్ తర్వాత రైతుగా మారానంటూ.. కఠినమైన ఇంగ్లిష్ పదాలతో ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిని ప్రశంసించారు. మేనేజ్‍మెంట్‍లో కెరీర్‌ను వదులుకొని తాను తన జిల్లాలో పుట్టగొడుగులను సాగు చేసేందుకు ధైర్యం చేశానని చెప్పారు. అయితే ఇందులో ఎక్కువ భాగం ఇంగ్లిష్ పదాలను వాడడంతో కాసేపటి తర్వాత ఆ రైతు ప్రసంగాన్ని సీఎం అడ్డుకున్నారు.
ఇదేమైనా ఇంగ్లండా?
Bihar CM Nitish Kumar: అమిత్ కుమార్ ఎక్కువగా ఇంగ్లిష్ పదాలు వాడడంపై సీఎం నితీశ్ అసహనం వ్యక్తం చేశారు. “మీరు ఎక్కువగా ఇంగ్లిష్ పదాలు వాడుతుండడం గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మీరు బిహార్‌లో పని చేస్తున్నారు. సామాన్యుల వృత్తి అయిన వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు సూచనలు ఇవ్వడానికి మేం ఇక్కడికి పిలిచాం. మీరేమో ఇంగ్లిష్‍లో మాట్లాడుతున్నారు. ఇది ఏమైనా ఇంగ్లాండా? ఇది ఇండియా, బిహార్" అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీంతో ఆడిటోరియంలో ఉన్న వారంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు.
“కొవిడ్ వల్ల చాలా కాలం లాక్‍డౌన్లు రావటంతో చాలా మందికి స్మార్ట్ ఫోన్లు బాగా అలవాటయ్యాయి. దీంతో సొంత భాషనే మర్చిపోయారు” అని సీఎం అన్నారు. ఆ తర్వాత ఆ రైతు మళ్లీ ప్రసంగం ప్రారంభిస్తూ గవర్నమెంట్ స్కీమ్స్ అని అన్నారు. మళ్లీ కలగజేసుకున్న సీఎం.. “ఏంటిది? సర్కారీ యోజన అని అనలేరా?” అని ప్రశ్నించారు. ఇక ఆ తర్వాత సారీ చెప్పిన ఆ రైతు ప్రసంగాన్ని కొనసాగించారు.
బీజేపీ విమర్శలు
ఇంగ్లిష్ మాట్లాడిన రైతుపై సీఎం నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదని బీజేపీ అభిప్రాయపడింది. “ఇంగ్లిష్ భాష అంటే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చిరాకా లేకపోతే సామాన్యులు మాట్లాడితే ఆయనకు నచ్చదా? ఇంగ్లిష్ పదాలను వాడడంపై బహిరంగ సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేయడం సరైన పద్ధతి కాదు” అని బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయ జనరల్ సెక్రటరీ నిఖిల్ ఆనంద్ అన్నారు.
సంబంధిత కథనం