Bihar bridge in field : ఇలాంటివి బిహార్‌లోనే జరుగుతాయి- పొలం మధ్యలో బ్రిడ్జ్! రూ. 3 కోట్ల ఖర్చు..
Bihar bridge in farm : బిహార్‌లో పొలం మధ్యలో బ్రిడ్జ్ కట్టేశారు! దాని కోసం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు. బ్రిడ్జ్‌కి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
చిత్ర విచిత్ర ఘటనలకు బిహార్ రాష్ట్రం కేరాఫ్ అడ్రెస్‌గా మారింది! నిన్న, మొన్నటి వరకు బ్రిడ్జ్‌లు కూలిపోతున్న ఘటనలతో బిహార్ వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు, అసలు రోడ్డే లేని ప్రాంతంలో బిహార్ అధికారులు ఒక వంతెన కట్టారు. పొలం మధ్యలో బ్రిడ్జ్‌ని కట్టేందుకు అయిన ఖర్చు ఏకంగా రూ. 3కోట్లు అని సమాచారం. పొలం మధ్యలో నిర్మించిన బ్రిడ్జ్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు కథ ఏంటంటే..
పొలం మధ్యలో బ్రిడ్జ్- అసలు కథ ఏంటంటే..
బిహార్ అరారియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. పచ్చటి పొలాల మధ్యలో అధికారులు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అసలు అక్కడ బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
'ప్రకృతి అందాలను పాడుచేయడానికి తప్ప ఈ బ్రిడ్జ్ దేనికీ పనికిరాదు,' అని స్థానికులు అంటున్నారు.
"పరమానంద్పూర్ గ్రామంలో 6 నెలల ముందు పొలంలో బ్రిడ్జ్‌ని నిర్మించారు. కానీ రోడ్డు వేయలేదు. పొలం మధ్యలో అదొక్కటే ఉండిపోయింది," అని గ్రామస్థులు అంటున్నారు. వాస్తవానికి తమ గ్రామంలో రోడ్డు లేదని, పొలం మధ్యలో నుంచి రోడ్డు వేయడనికి ఆ బ్రిడ్జ్ కట్టి ఉంటారేమో అని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. బిహార్ పొలంలో బ్రిడ్జ్‌పై అధికారులు కొన్ని విషయాలను వెల్లడించారు. 3.2 కి.మీల రోడ్డు వేయాల్సి ఉందని, పొలం మధ్యలో కనిపిస్తున్న బ్రిడ్జ్ కూడా అందులో భాగమని అంటున్నారు. మరోవైపు అసలు అది పూర్తిస్థాయి బ్రిడ్జే కాదని, కల్వర్ట్ అని అసిస్టెంట్ ఇంజినీర్ మనోజ్ కుమార్ చెబుతున్నారు.
"పొలం మధ్యలో ఉన్నది వంతెన కాదు. ఒక బాక్స్ కల్వర్ట్. కింద నీటి ప్రవాహాన్ని మెయిన్టైన్ చేసేందుకు దానిని ఉపయోగిస్తారు. ముఖ్యమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దీనిని నిర్మించారు. పరమానంద్పూర్ నుంచి కొపరి సరిహద్దు వరకు ప్రతిపాదిత 3.2 కి.మీల రోడ్డులో భాగంగా దీనిని నిర్మించారు. గ్రామస్థులు కాంట్రాక్టర్‌ని డబ్బులు అడిగారు. అతను ఇవ్వను అన్నాడు అందుకే ఫొటోలను మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు," అని అసిస్టెంట్ ఇంజినీర్ మనోజ్ కుమార్ తెలిపారు.
ఈ బాక్స్ కల్వర్ట్తో రెండు గ్రామాలకు చెందిన 1,500మందికి ప్రయోజనం కలిగిస్తుందని మనోజ్ అన్నారు. అయితే ప్రతిపాదిత రోడ్డులో 200 మీటర్లు ప్రైవేటు భూమి ఉందని, అందుకే బాక్స్ కల్వర్ట్ సమస్య వచ్చిందని అన్నారు. సమస్య పరిష్కారమైన తర్వాత దానిని రోడ్డుకు కనెక్ట్ చేస్తారని తెలిపారు. ఇందులో ఎలాంటి అవినీతి కోణం లేదని, నిబంధనలకు తగ్గట్టే బ్రిడ్జ్‌ని నిర్మించినట్టు వెల్లడించారు.
పొలం మధ్యలో బ్రిడ్జ్ ఘటనపై అరారియా జిల్లా మెడిస్ట్రేట్ ఇనాయత్ ఖాన్ విచారణకు ఆదేశించారు. రోడ్డు నిర్మాణం కోసం నిపుణుల బృందం సంబంధిత ప్రాంతంలో పర్యటిస్తోందని, ఏదైనా అవకతవకలు జరిగితే చెబుతుందని, అనంతరం సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
బిహార్ పొలం మధ్యలో వంతెన నిర్మాణంపై మీ ఒపీనియన్ ఏంటి?
సంబంధిత కథనం