UK rail strike : యూకేలో రైల్వే సమ్మె.. 30 ఏళ్లలో ఇదే పెద్దది.. ఎందుకంటే.. -biggest rail strike in 30 years brings uk to standstill ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Biggest Rail Strike In 30 Years Brings Uk To Standstill

UK rail strike : యూకేలో రైల్వే సమ్మె.. 30 ఏళ్లలో ఇదే పెద్దది.. ఎందుకంటే..

HT Telugu Desk HT Telugu
Jun 21, 2022 12:24 PM IST

యూకేలో రైల్వే సమ్మె స్టార్టయింది. గడిచిన 30 ఏళ్లలో ఇదే అతి పెద్ద రైల్వే సమ్మె కావడం ప్రస్తావనార్హం.

వాటర్‌లూ స్టేషన్: లండన్‌లో నేషనల్ రైల్ స్ట్రైక్ సందర్భంగా బోసిపోయిన వాటర్‌లూ స్టేషన్
వాటర్‌లూ స్టేషన్: లండన్‌లో నేషనల్ రైల్ స్ట్రైక్ సందర్భంగా బోసిపోయిన వాటర్‌లూ స్టేషన్ (REUTERS)

లండన్, జూన్ 21: బ్రిటన్‌లో అతి పెద్ద రైల్వే సమ్మె మంగళవారం మొదలైంది. వేతనాలు, ఉద్యోగ సంబంధిత అంశాలపై వేలాది మంది రైల్వే సిబ్బంది సమ్మె బాట పట్టారు. 

ట్రెండింగ్ వార్తలు

సమ్మె కారణంగా లండన్ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ కూడా మూసి వేశారు. దాదాపు 40 వేల మంది రైల్వే కార్మికులు మంగళ, గురు, శనివారాల్లో సమ్మె నిర్వహించనున్నారు. రైల్వే సమ్మెకు అనుగుణంగా కార్మికులు విభిన్న రైల్వే కార్యాలయాల పరిధిలో పికెట్ లైన్లు ఏర్పాటు చేశారు. 

కోవిడ్ మహమ్మారి నుంచి వ్యాపారాలు కోలుకుంటున్న వేళ ఇలాంటి ఇండస్ట్రియల్ యాక్షన్ మరింత నష్టపరుస్తుందని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న బ్రిటిష్ కుటుంబాలకు సాయం చేయడంలో ఆయన ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు.

ఆహార ధరలు, ఇంధన ధరలు బాగా పెరిగినందున టీచర్లు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, న్యాయవాదులు కూడా ఇండస్ట్రియల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్న వేళ రైల్వే సమ్మె తీవ్రమైన అసంతృప్తికి సంకేతంగా నిలుస్తుందని యూనియన్లు అంటున్నాయి.

అవసరమైనంత కాలం తమ సమ్మె కొనసాగుతుందని రైల్, మారిటైమ్, ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఆర్ఎంటీ) సెక్రటరీ జనరల్ మిక్ లించ్ స్పష్టం చేశారు.

అయితే వారికి సాయం చేయాలనుకున్న వారికి యూనియన్లు నష్టం చేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

‘రైల్వే సమ్మెకు వెళ్లడం ద్వారా ఇప్పటివరకు వారికి మద్దతుగా నిలిచిన ప్రయాణికులను కూడా దూరం చేసుకుంటున్నారు. ఈ సమ్మె అంతిమంగా దేశవ్యాప్తంగా వాణిజ్యం రంగంపై, సమాజంపై ప్రభావం చూపుతుంది..’ అని ప్రధానమంత్రి తన కేబినెట్‌ సహచరులకు చెబుతారని ఆయన కార్యాలయం వెల్లడించింది.

విధ్వంసక ద్రవ్యోల్భణం

కోవిడ్-19 మహమ్మారి నుంచి పుంజుకున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ.. కార్మికుల కొరత, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ద్రవ్యోల్భణం, బ్రెక్సిట్ అనంతరం వాణిజ్య సమస్యలు ఆర్థిక మాంద్యాన్ని హెచ్చరించే పరిస్థితి ఏర్పడింది.

లక్షలాది నిరుపేద కుటుంబాలకు అదనపు సాయం అందిస్తున్నామని, అయితే ద్రవ్యోల్భణానికి మించి వేతనాల పెంపుదల ఆర్థిక వ్యవస్జ ఫండమెంటల్స్‌ను దెబ్బతీస్తుందని ప్రభుత్వం చెబుతోంది.

‘సుస్థిరమైన అధికస్థాయి ద్రవ్యోల్భణం ప్రజల జేబులను దీర్ఘకాలంలో గుల్ల చేస్తుంది. వారి పొదుపును మాయం చేస్తుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న కష్టాలను పొడిగిస్తుంది..’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

‘వింటర్ ఆఫ్ డిస్‌కంటెంట్’గా పేరుగాంచిన 1978-79ల కాలం నాటి విస్తృత సమ్మెలతో ఈ సమ్మర్ ఆఫ్ డిస్‌కంటెంట్‌ను పోల్చుతున్నారు.

బ్రిటీష్ ఎయిర్‌పోర్టుల్లో సిబ్బంది కొరత కారణంగా తీవ్రమైన జాప్యాలు, చివరి నిమిషంలో విమాన ప్రయాణాల రద్దు వంటి సమస్యల నేపథ్యంలో ఈ సమ్మె రావడం గమనార్హం. 

రైల్వే సమ్మె కారణంగా సమ్మె దినాల్లో బ్రిటన్ రైల్ నెట్‌వర్క్‌లో సగం మాత్రమే పని చేస్తుంది. పరిమిత సర్వీసులు మాత్రమే నడుస్తాయి.

IPL_Entry_Point

టాపిక్