బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బెంగళూరులోని ఐటీ, బీటీ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం నగరంలోని అన్ని ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉన్నత పాఠశాలలు అక్టోబర్ 16న మూసివేసే ఉంటాయి.
బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు నగరంలో స్కూళ్లకు సెలవు ప్రకటించినట్టుగా ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
'వరదలు, ట్రాఫిక్ రద్దీ కారణంగా రవాణా వ్యవస్థలు అంతరాయం కలిగించవచ్చు. కార్యాలయానికి వెళ్లడం ప్రమాదాలను కలిగిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా, IT, BT, ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అక్టోబర్ 16న అనుమతించాలి.' అని ప్రభుత్వం తెలిపింది.
బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ జి జగదీశ బుధవారం (అక్టోబర్ 16) పాఠశాలలు, అంగన్‌వాడీలకు సెలవు ప్రకటించారు. అయితే కాలేజీలు తెరిచి ఉంటాయని తెలిపారు. మరోవైపు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అక్టోబర్ 17 ప్రభుత్వ సెలవుదినంగా రానుంది.
సోమవారం రాత్రి నుంచి బెంగళూరు నగరంలో కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్టోబర్ 15న కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా తలెత్తాయి. మరోవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాట్లను అందించేలా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సలహా ఇవ్వాలని టెక్కీలు డిమాండ్ చేస్తున్నారు.
వర్తూరు, హెబ్బాల్, కడుబీసనహళ్లి, చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లు జలమయమయ్యాయి, ఔటర్ రింగ్ రోడ్ (ORR), సర్జాపూర్‌లో టెక్ హబ్‌లు దెబ్బతిన్నాయి. బనశంకరిలోని సిండికేట్ బ్యాంక్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ చెట్లు నేలకొరిగాయి.
బెంగళూరు అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగర పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) తన ఎనిమిది జోన్లలో 24X7 ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వర్షాలకు సంబంధించిన సమస్యలను నివేదించడానికి హెల్ప్‌లైన్ నంబర్ 1533ను కూడా ప్రారంభించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు చిక్కబళ్లాపుర, చిక్కమగళూరు, హాసన్, కొడగు, కోలార్, మైసూరు, శివమొగ్గ, తుమకూరు, తీరప్రాంత కర్ణాటక జిల్లాలకు ఐఎండీ 'ఎల్లో' అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు ఏపీ, తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అక్కడక్కడా వానలు కురిశాయి. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటాయని ఐఎండీ పేర్కొంది.