ప్రధాని కార్యక్రమాల కోసం ఆర్టీసీ బస్సులు.. ప్రజలకు తీవ్ర ఇక్కట్లు!
PM Modi visit to Bangalore : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బెంగళూరు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురైనట్టు తెలుస్తోంది. పీఎం మోదీ పాల్గొన్న ఈవెంట్ల కోసం.. అధికార బీజేపీ తమ మద్దతుదారులను తీసుకొచ్చేందుకు దాదాపు 4,500 ఆర్టీసీ బస్సులను ఉపయోగించినట్టు సమాచారం. అదే సమయంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లాయి. ఫలితంగా శుక్రవారం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.
PM Modi visit to Bangalore : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటన బిజీబిజీగా జరిగింది. తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని పరిస్థితేంటో కానీ.. ఆ సమయంలో బెంగళూరు ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు లేక.. బెంగళరువాసులు ఉక్కిరబిక్కిరి అయ్యారని సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
ఏం జరిగింది?
కర్ణాటక పర్యటన కోసం ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ పాల్గొనే ఈవెంట్లకు భారీ సంఖ్యలో మద్దతుదారులను తరలించి, తమ బలాన్ని చాటిచెప్పాలని భావించింది అధికార బీజేపీ. ఇందుకోసం బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్), కేఎస్ఆర్టీసీకి చెందిన 4,500 బస్సులను వినియోగించింది.
కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో ఉదయం 10 గంటల సమయంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను లాంచ్ చేశారు ప్రధాని మోదీ. ఆ సమయంలో మెజిస్టిక్ బస్ టర్మినస్ వద్ద సేవలు నిలిచిపోయాయి. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బస్సులు కదలకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందిపడినట్టు సమాచారం. మరికొన్ని బస్సులు.. రోజూ వెళ్ల మార్గంలో కాకుండా, వేరా ప్రాంతాల్లో తిరిగినట్టు తెలుస్తోంది.
PM Modi Bengaluru events : మొత్తం మీద.. మోదీ ఈవెంట్ల కోసం కర్ణాటక ప్రభుత్వం 2,400 బీఎంటీసీ, 2,100 కేఎస్ఆర్టీసీ బస్సులను వాడుకున్నట్టు ఓ నివేదిక పేర్కొంది.
శుక్రవారం బస్సు సేవల్లో మార్పులు ఉంటాయని ప్రజలకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆ నివేదిక తెలిపింది. ఫలితంగా చాలా సేపటివరకు బస్సుల కోసం బస్ స్టాపుల్లో ప్రజలు నిరీక్షిస్తూనే ఉండిపోయారు. ఏం జరిగిందని అధికారులను ప్రజలు ప్రశ్నించగా.. 'కనకదాస జయంతి కావడంతో పబ్లిక్ హాలీడే ఉంది. ఈ సమయంలో ప్రజలు బస్సులు ఎక్కుతారని అనుకోలేదు,' అని సమాధనం వచ్చింది!
బీఎంటీసీని సిబ్బంది కొరత ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ప్రజల అవసరాలను తీర్చేంత శక్తి బీఎంటీసీకి ఉండటం లేదు. ఇప్పుడు వీఐపీ కల్చర్‌తో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. వీఐపీ కల్చర్‌తో రోడ్లను బ్లాక్ చేస్తున్నారని, ఇప్పటికే ట్రాఫిక్‌తో అల్లాడిపోతున్న తమకు మరిన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయని పలువురు బెంగళూరువాసులు నెట్టింట పోస్టులు పెట్టారు. తమ బాధను నెట్టింట పంచుకుంటున్నారు.
ఇక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంచ్ సమయంలో పలు రైళ్లను దారి మళ్లించింది దక్షిణ రైల్వే. అక్కడ కూడా ప్రజలు ఇబ్బందిపడ్డారు.
సంబంధిత కథనం
Visakha Modi Meeting : ఆంధ్రాకు అండగా ఉంటామన్న ప్రధాని నరేంద్ర మోదీ…
November 12 2022
PM Modi In Visakha : విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం….
November 12 2022