Bengaluru Traffic : ట్రాఫిక్ జామ్‌లో ఆసియాలోనే బెంగళూరు టాప్.. అనవసరంగా 132 గంటలు వేస్ట్
Bengaluru Traffic : బెంగళూరు ట్రాఫిక్ జామ్ గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం. తాజాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఆసియాలోనే ట్రాఫిక్ జామ్‌లో బెంగళూరు మెుదటి స్థానంలో ఉంది.
దిల్లీ, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్ చాలా సాధారణం. అయితే ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోని టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు కూడా ఉంది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ప్రకారం, బెంగుళూరు ట్రాఫిక్ పరంగా ఆసియాలోని అత్యంత అధ్వాన్నమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ పీక్ అవర్స్‌లో కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 28 నిమిషాల 10 సెకన్లు పడుతుంది. అంటే ఇక్కడ నివసించే ప్రజలు రద్దీ సమయాల్లో ఏటా దాదాపు 132 అదనపు గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోతారు.
బెంగళూరులో రద్దీ పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. బెంగళూరు నగరంలో జనాభా వేగంగా పెరుగుతోంది. మరోవైపు పట్టణ మౌలిక సదుపాయాలు, సిటీ విస్తరిస్తోంది. చాలా ఐటీ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దక్షిణ, ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల జనాలు బెంగళూరులో బతుకుతుంటారు. ఈ సిటీలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరడం లేదు. ఈ నగరంలోని రోడ్ల మీద ప్రయాణం చేయడం పీక్ అవర్స్‌లో పెద్ద టాస్క్.
ఈ జాబితాలో పూణే రెండో స్థానంలో ఉంది. 10 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతుందని నివేదిక పేర్కొంది. దీని తర్వాత ఫిలిప్పీన్స్‌లోని మనీలా (27 నిమిషాల 20 సెకన్లు), తైవాన్‌లోని తైచుంగ్ (26 నిమిషాల 50 సెకన్లు) ఉన్నాయి.
6 ఖండాల్లోని 55 దేశాలకు చెందిన 387 నగరాల మీద రిసెర్చ్ చేసి నివేదికను విడుదల చేశారు. అలా ఆసియాలోనే అత్యంత్త ట్రాఫిక్ జామ్ అవుతున్న నగరంగా బెంగళూరు వచ్చింది. నగరాల్లో సగటు ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులతోపాటుగా మరికొన్ని అంశాల ఆధారంగా అంచనా వేసి నివేదిక సిద్ధం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. లండన్ అత్యంత నెమ్మదిగా వాహనాలు కదిలే నగరంగా ఉంది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 37 నిమిషాల 20 సెకన్లు పడుతుంది.