బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్య రహస్య రెండో వివాహాన్ని బహిర్గతం చేయడానికి గూఢచారిగా మారాడు. నకిలీ ఎంప్లాయర్ గా మారి జూమ్ కాల్ లో తన భార్య రెండో వివాహం చేసుకుందన్న విషయాన్ని ఆమె ద్వారానే తెలుసుకున్నాడు. మొత్తం రుజువులు సంపాదించి కోర్టుకు సమర్పించాడు. కోర్టు అతడికి విడాకులు మంజూరు చేయడమే కాకుండా, శాశ్వత భరణం కోసం అతని భార్య చేసిన డిమాండ్ ను తోసిపుచ్చింది. మొత్తానికి, నాలుగేళ్ల పాటు సాగిన విడాకుల కేసులో ఆ భర్త విజయం సాధించాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆ భార్యాభర్తలిద్దరు బెంగళూరులో సాఫ్ట్ వేర్ జాబ్స్ లో ఉన్నారు. వారు దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్ తాలూకాలో వివాహం చేసుకుని బెంగళూరులోని కేఆర్ పురంలో స్థిరపడ్డారు. ఆ తరువాత వారి మధ్య విబేధాలు పెరిగి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తన భర్తపై ఆ యువతి గృహహింస, వరకట్న వేధింపుల ఆరోపణలు చేసింది. తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది. శాశ్వత భరణం కింద రూ.3 కోట్లు, నెలవారీ మెయింటెనెన్స్ కింద రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. క్రూరత్వం, మానసిక వేధింపులు, నమ్మకద్రోహం కారణంగా చూపుతూ అతడు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఐ-ఏ) కింద 2021లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.
కోర్టులో కేసు నడుస్తుండగానే, ఆ భర్త తన భార్య రెండో వివాహం చేసుకుందని అనుమానించాడు. ఆ దిశగా రుజువులు సాధించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన భార్యకు, ఆమె మాజీ ప్రియుడికి మధ్య ఆర్థిక లావాదేవీలు జరగడం గమనించిన భర్తకు అనుమానం వచ్చింది. 2018 డిసెంబర్లో తమ పెళ్లికి ముందే తమ బంధం ముగిసిందని ఆమె చెప్పినప్పటికీ, అది రహస్యంగా కొనసాగిందని అతను విశ్వసించాడు. ఆ తరువాత విడాకుల కేసు కొనసాగుతుండగానే, ఆమె తన మాజీ ప్రియుడిని రహస్యంగా వివాహం చేసుకున్న విషయాన్ని అతడు గుర్తించాడు.
ఆ తరువాత, నిజం బయటపెట్టాలని నిశ్చయించుకున్న ఆ భర్త తన భార్యకు మారు పేరుతో, తనను తాను ఎంప్లాయర్ గా పరిచయం చేసుకుని నకిలీ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఆ తరువాత జూమ్ కాల్ ద్వారా జాబ్ ఇంటర్వ్యూ చేశాడు. అక్కడ ఆమె అనుకోకుండా తన "మొదటి వివాహం" ముగిసిందని, ఇప్పుడు వేరొకరిని వివాహం చేసుకున్నానని వెల్లడించింది. ఇదే విషయాన్ని మెయిల్ లో రాతపూర్వకంగా కూడా తెలిపింది.
దీంతో ఆయన మరింత లోతుగా తవ్వారు. ఆర్టీఐ దరఖాస్తులను ఉపయోగించి, ఆమె రెండో వివాహ రికార్డులు, పాన్ వివరాలు, ఆమె తన మాజీ ప్రియుడితో చేసిన ప్రయాణాల వివరాలున్న ట్రావెల్ లాగ్స్, పేరు మార్పు అఫిడవిట్ మొదలైన అనేక పత్రాలను సంపాదించాడు. వాటి ద్వారా ఆమె మార్చి 2023 లో రెండవ వివాహం చేసుకుందని నిర్ధారించుకున్నాడు.
తాను సంపాదించిన రుజువులను ఆ భర్త కోర్టుకు అందించాడు. వాదనలు విన్న కోర్టు, సాక్ష్యాధారాలను పరిశీలించి వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య భరణం, మెయింటెనెన్స్ డిమాండ్ లను తోసిపుచ్చింది. ఆమె బంగారు ఆభరణాలను మాత్రం తిరిగి ఇవ్వాలని ఆ భర్తను ఆదేశించింది.
విడాకుల కేసులో భర్తకు ఆర్థిక ఉపశమనం లభించిన అరుదైన కేసుగా ఈ కేసు నిలిచింది. లిటిగేషన్ ఖర్చుల కింద రూ.30,000 అతడికి ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది.
సంబంధిత కథనం