Bengaluru techie: పది రోజుల క్రితం బెంగళూరు నుంచి మాయమైన టెక్కీ.. చివరకు నోయిడా మాల్ లో..!; ఆ టెక్కీ వైఫ్ పోస్ట్ వైరల్
బెంగళూరులో దాదాపు 10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేసు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టినా బెంగళూరు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆ టెక్కీ భార్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
10 రోజుల క్రితం మాయమైన బెంగళూరు టెక్కీని పోలీసులు ఎట్టకేలకు నోయిడాలోని ఒక మాల్ లో పట్టుకున్నారు. ఆ టెక్కీ తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుని కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ టెక్కీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి అదృశ్యం వెనుక కారణాలను విచారిస్తున్నారు.
సడెన్ గా కనిపించకుండా పోయి..
10 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ విపిన్ గుప్తా, ఆగస్ట్ 15న ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోని ఓ మాల్ లో కనిపించాడు. విపిన్ గుప్తా ఆగస్టు 4వ తేదీ నుంచి కనిపించడం లేదని అతని భార్య బెంగళూరులోని కొడిగెహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చివరగా, ఆగస్టు 4న మధ్యాహ్నం 12:42 గంటల సమయంలో కోడిగెహళ్లిలోని టాటానగర్ ప్రాంతంలో విపిన్ తన ఆకుపచ్చ కవాసాకి నింజా మోటార్ సైకిల్ పై ఇంటి నుంచి బయలుదేరుతుండగా కనిపించాడు. అతను కనిపించకుండా పోయిన కొద్ది సేపటికే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.8 లక్షలు విత్ డ్రా అయ్యాయని, అప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని అధికారులు గుర్తించారు.
వైఫ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్
తన భర్త ఆచూకీ కనుగొనేందుకు సాయం చేయాలని విపిన్ భార్య శ్రీపర్ణ దత్తా ఫేస్ బుక్ లైవ్ లో విజ్ఞప్తి చేశారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ దర్యాప్తులో పెద్దగా పురోగతి లేదని ఆమె వీడియోలో ఆరోపించారు. ఆమె అభ్యర్థన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో, పోలీసులు ఈ కేసుపై మరింత దృష్టి పెట్టారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ద్వారా కూంబింగ్ చేయడం, ఆర్థిక లావాదేవీలు, ఇతర డిజిటల్ సాక్ష్యాలను పరిశీలించడం సహా వివిధ సాక్ష్యాధారాలను అధికారులు పరిశీలించారు. చివరికి విపిన్ గుప్తా నోయిడా లోని ఒక మాల్ లో ఉన్నట్లు గుర్తించారు.
గుండు చేసుకుని..
నోయిడాలోని మాల్ లో పోలీసులు విపిన్ గుప్తాను గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడు శిరోముండనం చేసుకుని, తన రూపాన్ని మార్చుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. బెంగళూరు నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలు, తన రూపాన్ని మార్చుకోవాలన్న నిర్ణయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ‘‘నోయిడా సమీపంలోని ఓ మాల్ లో #missingvipingupta ను గుర్తించాం. అతడు తన రూపురేఖలు మార్చుకున్నాడు. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని బెంగళూరు నార్త్ ఈస్ట్ డివిజన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (DCP) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇద్దరు చిన్నారుల తండ్రి..
విపిన్ గుప్తా, శ్రీపర్ణ దత్తా దంపతులకు 5 నెలలు, 14 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విపిన్ తన కూతుళ్లను గాఢంగా ప్రేమిస్తాడని, వారిని ఎప్పటికీ విడిచిపెట్టడని శ్రీపర్ణ తన సోషల్ మీడియా సందేశంలో నొక్కి చెప్పింది. ఆగస్టు 8న మా పాప అన్నప్రాసన కోసం వెళ్లాలని అనుకున్నాం. నా భర్త మమ్మల్ని ఎప్పటికీ వదలడు’’ అని ఆమె పేర్కొంది. విపిన్ ను కనుగొన్నందుకు బెంగళూరు (BENGALURU) పోలీసులను పలువురు సోషల్ మీడియా యూజర్లు ప్రశంసించారు.